Lahiru Thirimanne : శ్రీలంక(Srilanka) టీ20 వరల్డ్ కప్ హీరో లహిరు తిరుమన్నే(Lahiru Thirimanne) అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు వీడ్కోలు పలికాడు. 33 ఏళ్ల ఈ టాపార్డర్ బ్యాటర్ ఈరోజు ఫేస్బుక్ పేజీ వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆటకు గుడ్ బై చెప్పడం కష్టంగానే ఉందన్న అతను ఈ అనూహ్య నిర్ణయానికి కారణం మాత్రం చెప్పలేదు.
‘ఆటగాడిగా నేను ప్రతిసారి ఉత్తమ ప్రదర్శన చేశాను. శక్తివంచన లేకుండా కృషి చేశాను. క్రికెట్‌ను ఎంతో గౌరవించాను. అంతేకాదు నా మాతృదేశం తరఫున నిజాయతీగా నా బాధ్యతలు నిర్వర్తించాను. ఆటకు అల్విదా చెప్పడం కష్టమైన నిర్ణయమే.
అయితే.. ఈ నిర్ణయానికి దారి తీసిన ఊహించని కారణాలను నేను చెప్పదలచుకోవడం లేదు. ఇన్నేళ్లు నాకు సహాయ సహకారాలు అందించిన శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులు, కోచ్‌లు, జట్టు సభ్యులు, ఫిజియో, ట్రైనర్స్, అనలిస్ట్‌లు.. వీళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని తిరుమన్నే తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 13 ఏళ్ల కెరీర్లో అతను 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20లు ఆడాడు.
తిరుమన్నే 2010లో వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. భారత్‌తో మిర్పూర్(Mirpur) వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. 2013లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో అతను మొదటి హాఫ్ సెంచరీ కొట్టాడు. అంతేకాదు 2014లో పొట్టి ప్రపంచ కప్(T20 WC 2014) గెలిచిన శ్రీలంక జట్టులో తిరుమన్నే సభ్యుడు.
2015 వరల్డ్ కప్‌లో సెంచరీ కొట్టిన తిరుమన్నే
టాపార్డర్‌లో కీలక ఆటగాడైన తిరుమన్నే 2015లో ఓ రేంజ్లో చెరలేగాడు. ఆ ఏడాది వరల్డ్ కప్‌లో సెంచరీతో పాటు 861 రన్స్ సాధించాడు. ఆసియా కప్‌లో రెండు సెంచరీలతో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది లంక చాంపియన్‌గా నిలిచింది. టెస్టుల్లో 3 సెంచరీలతో కలిపి 2,088 రన్స్ కొట్టాడు. వన్డేల్లో 3,194 పరుగులు, టీ20ల్లో 291 పరుగులు చేశాడంతే.