All Time Records : ఆట ఏదైనా సరే.. రికార్డులు(Records) ఉండేది బద్దలుగొట్టేందుకే కదా! ఎంతగొప్ప రికార్డయినా ఏదో ఒక నాటికి ఎవరో ఒకరు అధిగమించి తమ పేర రాసుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన క్రికెట్(Cricket) కూడా అందుకు మినహాయింపు కాదు. ఆటగాళ్లు ఎప్పటికప్పుడు పాత రికార్డుల దుమ్ము దులిపేస్తూ కొత్తవి నమోదు చేస్తూనే ఉంటారు. ఇక, ఎవరికీ సాధ్యం కాదనుకున్న రికార్డులు కూడా బద్దలయ్యాయి. అయితే.. ఎప్పటికీ, ఎవరూ బ్రేక్ చేయలేని కొన్ని రికార్డులు ఉన్నాయంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం. దశాబ్దాలుగా ఈ రికార్డులు చెక్కు చెదరలేదు. మున్ముందు కూడా ఇవి బద్దలవుతాయన్న ఆశ లేదు. మరి అంత ఘనమైన రికార్డులు (Greatest Records)ఏంటీ?.. వాటి కథ ఏంటో తెలుసుకుందామా!
శ్రీలంక దిగ్గజ బౌలర్ చమిందా వాస్(Chaminda Vaas) ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడు. అతడు తనపేరున సువర్ణాక్షరాలతో లిఖించదగిన రికార్డును నమోదు చేశాడు. 2001లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వాస్ 19 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు నేలకూల్చాడు. అంటే ప్రత్యర్థి జట్టులోని 80 శాతం వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడన్నమాట.
చమిందా వాస్ – శ్రీలంక దిగ్గజ బౌలర్
వాస్ దెబ్బకు జింబాబ్వే జట్టు గింగిరాలు తిరిగింది. 15.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. బలహీనమైన జింబాబ్వేపై అతను ఈ రికార్డు సాధించినా.. ఈ రికార్డును ఇప్పట్లో బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం.
ఆస్ట్రేలియా బ్యాటర్ జాసన్ గిలెస్పీ(Jason Gillespie) పేరును బంగ్లాదేశ్ ఎప్పటికీ మర్చిపోదు. 2006లో చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన గెలెస్పీ అజేయ డబుల్ సెంచరీ (201 నాటౌట్) సాధించి రికార్డులకెక్కాడు.
జాసన్ గిలెస్పీ (201 నాటౌట్)
అతడి కెరియర్లో చిట్టగాంగ్ మ్యాచ్ చిరస్మరణీయగా నిలిచిపోతుంది. నిజానికి ఆట ముగియడానికి ముందు మరో వికెట్ కోల్పోకుండా కొన్ని ఓవర్లపాటు బౌలర్లను ఎదుర్కోవడమే నైట్‌వాచ్‌మన్ విధి. కానీ, అలా వచ్చిన గిలెస్పీ ఏకంగా `డబుల్` బాది మరెవరికీ సాధ్యంకాని రికార్డు సృష్టించాడు.
టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజులు జరుగుతుంది. అయితే.. కొన్నిసార్లు మూడు రోజుల్లోనే ముగిసిపోతుంది. చాలా అరుదుగా రెండురోజుల్లోనే ముగిసిన గేమ్స్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని గంటల్లోనే టెస్టు మ్యాచ్(Test Match) ముగిసిందన్న మీకు తెలుసా? 1932లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. 5 గంటల 53 నిమిషాల్లోనే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 153 పరుగులు చేసింది.
బెర్ట్ ఇరోన్మోంగెర్ – ఆసీస్ ఆఫ్ స్పిన్నర్
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 36, రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలింగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ బెర్ట్ ఇరోన్మోంగెర్(bert ironmonger) 24 పరుగులిచ్చి 11 వికెట్లు నేలకూల్చాడు. మ్యాచ్ ఆరు గంటల్లోనే ముగియడంతో ఐదు రోజులకు టికెట్లు కొన్న ప్రేక్షకులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
టెస్టు మ్యాచ్‌లో ఓ బౌలర్ ఎన్ని ఓవర్లు వేయగలడు? గరిష్టంగా 30-40 ఓవర్లు వేయగలడేమో! అంతకుమించి బంతులు సంధించాలంటే స్టామినా సరిపోదు. కానీ, 1957లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ దిగ్గజ స్పిన్నర్ సోనీ రామ్‌దిన్(Sonny Ramadhin) అలుపుసొలుపు లేకుండా ఏకంగా 98 ఓవర్లు వేశాడు.
వెస్టిండీస్ స్పిన్నర్ సోనీ రామ్‌దిన్
ఒక ఇన్నింగ్స్‌లో ఇన్ని ఓవర్లు వేయడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. మోడర్న్ క్రికెట్లో జింబాబ్వే దివంగత బౌలర్ రే ప్రైస్ 2001లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 79 ఓవర్లు వేశాడు. కాగా, సోనీ రామ్‌దిన్ 92 ఏళ్ల వయసులో గతేడాది ఫిబ్రవరి 27న కన్నుమూశాడు.
వెస్టిండీస్‌కు చెందిన ఫిల్ సిమన్స్(Phil Simmons) పేరు కూడా రికార్డు పుస్తకాల్లో చెక్కుచెదరకుండా ఉంది. పాకిస్థాన్‌తో 1992లో జరిగిన వన్డేలో సిమన్స్ 10 ఓవర్లు వేసి మూడంటే మూడే పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేటు 0.30.
ఫిల్ సిమన్స్
ఇప్పుడు చెప్పండి.. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనైనా ఈ రికార్డును బద్దలగొట్టడం సాధ్యమా? ఈ టీ20 క్రికెట్(T20 Cricket Era) యుగంలో అస్సలు సాధ్యం కాదని నిస్సంకోచంగా చెప్పొచ్చు.
ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan).. ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో ఒకడు. శ్రీలంక జట్టులో మురళీధరన్ ఉన్నాడంటే ప్రత్యర్థి జట్లు భయంతో వణికిపోయేవి. అతడి బంతుల దెబ్బకు 1,347 మంది బాధితులుగా మారారు.
ముత్తయ్య మురళీధరన్ – శ్రీలంక
రెండు దశాబ్దాలపాటు ప్రత్యర్థి బ్యాటర్లకు సింహస్వప్నంగా మారిన మురళీధరన్ టెస్టుల్లో 800, వన్డేల్లో 547 వికెట్లు తీసుకున్నాడు. అతడి సమకాలీనుడు, దివంగత షేన్‌వార్న్ 1,001 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో 1956లో ఓల్డ్‌ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ బౌలర్ జిమ్ లేకర్(Jim Laker) అత్యద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 53 పరుగలిచ్చి పదికి పది వికెట్లు నేలకూల్చాడు. అంటే.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 90 పరుగులిచ్చి 19 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇవి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా మిగిలిపోయాయి.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ఫ్రెడ్ రోడ్స్(Wilfred Rhodes) పేరున బోల్డన్ని రికార్డులు ఉన్నాయి. ఈ దిగ్గజ క్రికెటర్ టెయిలెండర్‌గా బ్యాటింగ్ ప్రారంభించి, ఆ తర్వాత ఓపెనర్‌గా కెరియర్ను ముగించాడు. అంతేకాదు 52 సంవత్సరాల 165 రోజుల వయసులో టెస్టు మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుత కాలంలో 30 ఏళ్లకే ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు.
విల్ఫ్రెడ్ రోడ్స్ – ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
కాబట్టి.. విల్ఫ్రెడ్ రికార్డు బద్దలుకావడం దాదాపు అసాధ్యం. అతడి పేరున మరో రెండు రికార్డులు కూడా ఉన్నాయి. అత్యధిక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు (1,110) ఆడిన ఆటగాడిగా, అత్యధిక ఫస్ట్‌క్లాస్ వికెట్లు (4,000) తీసిన క్రికెటర్‌గా అతడు చెక్కు చెదరని రికార్డులు నెలకొల్పాడు.
ఇంగ్లండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడైన సర్ జేక్ హాబిస్(Sir Jack Hobbs) కెరియర్లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 1905లో క్రికెట్లో అడగుపెట్టిన అతను1934లో రిటైరయ్యాడు. `ది మాస్టర్`గా చిరపరిచితుడైన జేక్ కెరియర్లో మొత్తం 60 వేల పరుగులు సాధించాడు. ఇందులో 199 సెంచరీలు ఉండడం మరో రికార్డు. ఈ రికార్డు కూడా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.
క్రికెట్ ప్రేమికులకు చప్పున గుర్తొచ్చే పేరు సర్ డాన్ బ్రాడ్‌మన్(Sir Don Bradman). ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ తన చివరి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసి ఉంటే టెస్టు సగటు 100గా ఉండేది. అయితే, డకౌట్ కావడంతో అది 99.94గా మిగిలిపోయింది.
డాన్ బ్రాడ్‌మన్
అయితే, ఇప్పటికీ అదే అత్యధిక బ్యాటింగ్ సగటుగా క్రికెట్ రికార్డుల్లో భద్రంగా ఉంది. అతడి తర్వాత సౌతాఫ్రికా క్రికెటర్ గ్రేమ్ పొలాక్ 60.97, టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) 66.25 సగటు సాధించారు.