Ambati Rayudu : మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న కొన్నాళ్లుగా అభిమానుల్లో మొదలైంది. ఈ ప్రశ్నకు ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు(Ambati Rayudu) ఆసక్తికర సమాధానం చెప్పాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సారథిగా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) నియమితుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అతను తెలిపాడు.
ఐపీఎల్ ప్రారంభం (2008) నుంచి 16 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా నడిపిస్తున్న మహీ.. భావి కెప్టెన్‌గా రుతురాజ్‌ను తీర్చిదిద్దాడని రాయుడు చెప్పుకొచ్చాడు. ధోనీ ఎక్కువ కాలం చెన్నై సారథిగా కనిపించకపోవచ్చనే ఊహగానాల మధ్య రాయుడు వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
రుతురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోనీ
2019 వన్డే ప్రపంచకప్(ODI WC 2019) సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి అనంతరం ధోనీ తిరిగి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి కేవలం ఐపీఎల్లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. అతను అందుబాటులో లేని సమయంలో కొన్నిసార్లు సురేశ్ రైనా(Suresh Raina) కెప్టెన్‌గా వ్యవహరించగా.. నిరుడు రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినా ఆ ప్రయోగం బెడిసి కొట్టింది. జడ్డూ సారథిగా ఆకట్టుకోలేకపోగా.. చెన్నై వరుస పరాజయాలు మూటగట్టుకుంది.
ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ, రాయుడు, జడేజా
దీంతో మేనేజ్మెంట్ కోరిక మేరకు తిరిగి పగ్గాలు చేపట్టిన ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ 16వ సీజన్లో సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. చెన్నైకి రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనీకి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.