Minister KTR | హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను సాట్స్, క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 24న సాట్స్ సహకారంతో ‘ట్రై క్రీడా పోటీలు’ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో క్రీడా పోటీలకు సంబంధించి పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో అభివృద్ధికి తోడు పలు ప్రముఖ కంపెనీల ఏర్పాటు వెనుక మంత్రి కేటీఆర్ కృషి వెలకట్టలేనిది. దీని వల్ల ప్రైవేట్ రంగంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. వీరి స్ఫూర్తిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్‌రౌండ్ డెవలప్మెంట్ నినాదంతో ఈ నెల 24న ట్రై క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. నెక్లెస్ రోడ్లో సైక్లింగ్, ఇందిరాపార్క్‌లో స్కేటింగ్, యూసుఫ్‌గూడ స్టేడియంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్‌యాదవ్, మర్రి లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.