కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తనను ఐపీఎల్ ఆడకుండా అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఆ జట్టు పేసర్ నువాన్ తుషారా కోర్టును ఆశ్రయించాడు. 31 ఏండ్ల ఈ బౌలర్.. తాజా సీజన్లో ఆర్సీబీతో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఐపీఎల్లో ఆడాలనుకునే శ్రీలంక క్రికెటర్లు.. ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితేనే వారికి ఎన్వోసీ జారీ చేస్తున్నది.
తుషారా ఫిట్నెస్ టెస్టులో విఫలమవడంతో అతడి ఐపీఎల్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో తుషారా.. కొలంబో డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించి, తాను ఐపీఎల్ ఆడేలా బోర్డును ఆదేశించాలని కోరాడు. లంక బోర్డుతో తన కాంట్రాక్టు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందని, ఎన్వోసీ ఇవ్వకపోవడం అన్యాయమని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నాడు.