కొలంబో: స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో శ్రీలంక మహిళల జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. డెర్క్సెన్ (61), లారా (46) ఆ జట్టును ఆదుకున్నారు.
లంక బౌలర్లలో మల్కి (4/50), విహంగ (3/41) రాణించారు. స్వల్ప ఛేదనను శ్రీలంక 46.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. హర్షిత సమరవిక్రమ (77), కవిష (61) నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ సౌతాఫ్రికాకు ఇది రెండో పరాభవం.