కొలంబో: చాంపియన్స్ ట్రోఫీ ముందు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైన ఆ జట్టుకు శ్రీలంక ఝలక్ ఇచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఏకంగా 174 పరుగుల తేడాతో ఓడింది. ఆసియా గడ్డపై కంగారూలకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద (ఓవరాల్‌గా ఐదోది) పరాభవం. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (101) సెంచరీతో కదం తొక్కగా కెప్టెన్ చరిత్ అసలంక (78) మరోసారి మెరిశాడు. నిషాన్ (51) కూడా రాణించాడు. లక్ష్య ఛేదనలో ఆసీస్ 24.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (29) టాప్ స్కోరర్ కాగా మరో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలగె (4/35), వనిందు హసరంగ (3/23), అసిత ఫెర్నాండో (3/23) కంగారూలను కట్టడి చేశారు.