Sri Lanka | కొలంబో : శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డేల్లో టీమ్ఇండియాపై ఏడేండ్లలో తొలి విజయాన్ని లంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 275/9 స్కోరు చేసింది. రీచా ఘోష్ (58) అర్ధసెంచరీతో రాణించగా, రోడ్రిగ్స్ (37), ప్రతికా రావల్ (35) ఆకట్టుకున్నారు.
ప్రతిక, స్మృతి మందన.. జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 51 పరుగులు జతచేశారు. మిడిలార్డర్ కూడా తలో చేయి వేయడంతో భారత్‌కు పోరాడే స్కోరు దక్కింది. సుగందిక, చమరి..మూడేసి వికెట్లు తీశారు. నిర్దేశిత లక్ష్యాన్ని లంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. నీలాక్షిక సిల్వా (56), హర్షిత (53) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకమయ్యారు. ముఖ్యంగా నీలాక్షిక తన ఇన్నింగ్స్‌లో 5ఫోర్లు, 3సిక్స్‌లతో చెలరేగింది. స్నేహ్‌రానా(3/45) మూడు వికెట్లు తీసింది.