కొలంబో: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మహిళల ముక్కోణపు సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. సొంతగడ్డపై ఈ ఏడాది ఆఖర్లో జరిగే వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియాకు ఈ టోర్నీ కీలకం కానుంది. మెగాటోర్నీకి జట్టు కూర్పు కోసం ఈ సిరీస్‌ను వాడుకోవాలని చూస్తున్న భారత్ అందుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేసింది.
అండర్-19 ప్రపంచకప్‌తో పాటు ఇటీవలి డబ్ల్యూపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువ పేసర్ కాశ్వీ గౌతమ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెగ్యులర్ పేసర్లు టిటాస్ సాధు, రేణుకాసింగ్, పూజ వస్ర్తాకర్ గాయాలతో దూరం కావడంతో ముక్కోణపు సిరీస్‌లో హైదరాబాదీ అరుంధతిరెడ్డితో కలిసి కాశ్వీ పేస్ బౌలర్‌గా కొనసాగనుంది.
బ్యాటింగ్ విషయానికొస్తే షెఫాలీవర్మకు మరోసారి సెలెక్టర్లు మొండిచేయి చూపగా, నాయక ద్వయం హర్మన్‌ప్రీత్‌కౌర్, స్మృతి మందాన కీలకం కానున్నారు. వీరికి తోడు జెమీమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, రీచా ఘోష్ మిడిలార్డర్‌ను సమన్వయం చేయనున్నారు. ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య సిరీస్‌లో తొలి పోరు జరుగనుంది. చమరి ఆటపట్టు సారథ్యంలో నలుగురు కొత్త ప్లేయర్లతో శ్రీలంక దీటైన పోటీనిచ్చేందుకు పట్టుదలతో ఉన్నది.