ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా.. లంకతో పోరులో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 213 పరుగులకు పరిమితమైంది. ఈ ప్రదర్శనతో దునిత్ రికార్డు సృష్టించాడు. లంక తరఫున అతి పిన్న వయసులో 5 వికెట్ల ఘనత సాధించిన ఈ20 ఏండ్ల కుర్రాడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వికెట్లు ఖాతాలో వేసుకోవడం విశేషం. భారత్‌పై తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు భారత స్టార్ ప్లేయర్లు అవస్థలు పడ్డారు. ఇప్పటి వరకు 12 వన్డేలు మాత్రమే ఆడిన దునిత్‌కు ఈ ఫార్మాట్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.
గత మ్యాచ్‌లో పాక్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవుఫ్, నసీమ్ షాను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత టాపార్డర్.. లంకతో మ్యాచ్‌లో ఈ చిన్నోడికి దాసోహమైంది. ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు రాణించి మంచి స్కోరు అందించగా.. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం గిల్ (19) ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. గత మ్యాచ్‌లో దాయాదిపై అజేయ సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఆ వెంటనే రోహిత్ శర్మ (51) ఔటయ్యాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39) కాస్త పోరాడగా.. హార్దిక్ పాండ్యా (5), రవీంద్ర జడేజా (4) విఫలమయ్యారు. చివర్లో అక్షర్ పటేల్ (26) విలువైన పరుగులు జోడించడంతో భారత్ రెండొందల మార్క్ దాటింది.