Team India | కొలంబో (శ్రీలంక): అనుకున్నదే అయింది! శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ఇండియాకు అనూహ్య షాకిస్తూ ఆతిథ్య జట్టు సంచలనం సృష్టించింది. లంకేయులు విసిరిన స్పిన్ సవాలు ముందు ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత క్రికెట్ జట్టు చిత్తుచిత్తుగా ఓడి 27 ఏండ్ల తర్వాత ప్రత్యర్థికి సిరీస్ (వన్డేలలో)ను అప్పగించింది. లంక నిర్దేశించిన 249 పరుగుల ఛేదనలో భారత్.. 26.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలి 110 పరుగుల తేడాతో ఓడి మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ 0-2తో చేజార్చుకుంది. తొలి వన్డే డ్రా కాగా తర్వాత రెండు వన్డేలలోనూ రోహిత్ సేనకు షాకులు తప్పలేదు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిస్తున్న ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగె (5/27) ఐదు వికెట్లతో చెలరేగగా రెండో వన్డే హీరో జెఫ్రీ వాండర్సె (2/34), మహీశ్ తీక్షణ (2/45) స్పిన్ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది.
రోహిత్ శర్మ (20 బంతుల్లో 35, 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కోహ్లీ (20), శ్రేయస్ (8), గిల్ (6), రిషభ్ (6) దారుణంగా విఫలమయ్యారు. ఏకంగా ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో మెన్ ఇన్ బ్లూకు దారుణ పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు టాపార్డర్ రాణించడంతో పోరాడగలిగే లక్ష్యం దక్కింది. అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో శతకం కోల్పోగా కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59, 4 ఫోర్లు), పతుమ్ నిస్సంక (45) రాణించారు. అవిష్కకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వెల్లలగెకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కాయి. 1997 తర్వాత భారత్‌పై లంకకు స్వదేశంతో పాటు ఆవల కూడా ఇదే తొలి వన్డే సిరీస్ కావడం గమనార్హం.