సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా ఇద్దరు మేలిమి ముత్యాల్లాంటి బౌలర్లు ఈ ప్రపంచానికి పరిచయమయ్యారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఆ ఇద్దరు క్రికెటర్లు దేశ దృష్టిని తమ వైపునకు తిప్పుకున్నారు. ఆడుతున్నది తొలి మ్యాచ్ అయినా ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటూ ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ సత్తాచాటారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ప్రఫుల్ ప్రచండ పేస్‌తో వైభవ్ సూర్యవంశీ, దృవ్ జురెల్, ప్రిటోరియస్ డకౌట్లుగా పెవిలియన్ పంపి కొత్త చరిత్ర లిఖించాడు. అయితే మరోవైపు హింగేకు పోటీగా సకీబ్ హుస్సేన్..రాజస్థాన్‌పై వికెట్ల వేటలో అదరగొట్టాడు. హింగే టాపార్డర్ పనిపడితే..సకీబ్ తన పేస్ వైవిధ్యంతో మిడిలార్డర్‌తో పాటు లోయార్డర్ పనిపట్టాడు. సకీబ్ క్రికెట్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి.
బీహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతానికి చెందిన సకీబ్ది పేద కుటుంబం. తండ్రి అలీ అహ్మద్ హుస్సేన్ వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించేవారు. అయితే కాలి గాయం కారణంగా వ్యవసాయం భారంగామారడంతో సకీబ్ ఆ బాధ్యతను భుజానేసుకునే ప్రయత్నం చేశాడు. ఆర్మీలో చేరేందుకు గ్రామంలోని మైదానంలో రోజు ఉదయం ప్రాక్టీస్ చేసిన సకీబ్ క్రికెట్లోకి అనూహ్యంగా ప్రవేశించాడు. సకీబ్ ఫిట్నెస్ను పరిశీలించిన కోచ్‌లు క్రికెట్‌ను ఎంచుకొమ్మన్నారు. మొదట్లో స్థానిక టోర్నీల్లో టెన్నిస్ బాల్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సకీబ్…మ్యాచ్‌కు ఇంత చొప్పున ఆదాయాన్ని ఆర్జించేవాడు. కుటుంబ పోషణకు ఈ యువ క్రికెటర్ ఇతోధికంగా సాయం చేసేవాడు. అయితే అప్పటికే పేదిరికంలో ఉన్న సకీబ్ స్పైక్ షూస్ కొనేందుకు స్థోమత లేక తన మనుసులో మాటను తల్లి సుబుక్తారా ఖాతూన్ దగ్గర వెలిబుచ్చాడు. కొడుకు కోరికను కాదనలేని తల్లి తన నగలు అమ్మి వచ్చిన డబ్బుతో బూట్లు కొనిచ్చింది.
తన తల్లి త్యాగాన్ని మనుసులో పెట్టుకుని 17 ఏండ్ల ప్రాయంలో తొలిసారి రాష్ట్ర జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరంగేట్రం చేసిన ఈ యువ పేసర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి వరకు టెన్నిస్ బంతితో ఆడిన సకీబ్ తొలిసారి లెదర్ బంతితో ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన సకీబ్ గుజరాత్‌తో పోరులో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతని ప్రదర్శన ఆధారంగా చెన్నై నెట్‌బౌలర్‌గా సకీబ్‌ను తీసుకుంది. గత సీజన్ ముస్తాక్ అలీ టోర్నీలో 29.6 సగటుతో ఐదు వికెట్లు తీసిన ఈ యువ పేసర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 2024లో జట్టులోకి తీసుకున్నా బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ ఏడాది జరిగిన వేలంలో కనీస ధర రూ.30 లక్షలకు తీసుకున్న హైదరాబాద్..సకీబ్‌కు అవకాశమిచ్చి ప్రోత్సహించింది. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ స్కౌటింగ్‌లో దొరికిన సకీబ్ ప్రస్తుతం హైదరాబాద్ తురుపుముక్కగా మారాడు. వైవిధ్యమైన పేస్‌తో బ్యాటర్లకు పరీక్ష పెడుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని సకీబ్ విషయంలో మరోమారు రుజువు కాగా, ఈ యువ క్రికెటర్ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది.