SRH | హైదరాబాద్: ‘ఆరెంజ్ ఆర్మీ’ అభిమానుల నాలుగేండ్ల ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ కేటాయించడంతో ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరింది. 2020 తర్వాత సన్‌రైజర్స్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే ప్రథమం. 2021, 2022లో 8వ స్థానంలో ఉన్న హైదరాబాద్.. గతేడాది పదో స్థానంలో నిలవడం అభిమానులను బాధించింది.
గురువారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షంతోనే ఈ మ్యాచ్ సాగేది అనుమానంగా మారింది. వర్షం కాస్త తెరిపినిచ్చాక 6:30 గంటల నుంచి గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసేందుకు యత్నించినా.. రాత్రి 8 గంటల తర్వాత వరుణుడు మళ్లీ అంతరాయం కలిగించాడు. రాత్రి 10:30 గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్‌ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ఆస్వాదించలేకపోయినా.. హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. వాన పడుతున్న సమయంలో తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌కు తోడు లైటింగ్ షోతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గత మ్యాచ్‌ల లెక్కనే ఈ పోరుకు 33,781 మంది ప్రేక్షకులు స్టేడియానికి తరలిరావడం విశేషం.
13 మ్యాచ్‌లు ఆడి15 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్.. టాప్-2లో నిలిచేందుకు అవకాశాలున్నాయి.