SRH | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో నిరుటి రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో హైదరాబాద్ ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. సోమవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా సన్‌రైజర్స్‌కు చుక్కెదురు కాగా, ఢిల్లీ 13 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నది. లీగ్‌లో ఇప్పటికే చెన్నై, రాజస్థాన్..ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలుగగా, తాజాగా హైదరాబాద్ ఈ జాబితాలో చేరింది. సన్‌రైజర్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నా..ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ప్రస్తుతం 7 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 133/7 స్కోరుకు పరిమితమైంది.
కమిన్స్ (3/19) ధాటికి ఢిల్లీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్(41) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కమిన్స్ విజృంభణతో ఢిల్లీ టాపార్డర్ కకావికలమైంది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత హైదరాబాద్ బ్యాటింగ్ మొదలయ్యే సమయానికి వరుణుడు రంగప్రవేశం చేశాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురియడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కవర్లతో మైదానాన్ని దాదాపు కప్పి ఉంచినా లాభం లేకపోయింది. మైదానంలో భారీగా నీరు చేరడం, మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటకు అనుకూలంగా లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్ల సమక్షంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటి వరకు స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు నిరాశగా మైదానాన్ని వీడారు.
తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్..ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలన్న పట్టుదలతో సన్‌రైజర్స్ ఈసారి పలుమార్పులతో బరిలోకి దిగింది. సీనియర్ స్పీడ్‌స్టర్ షమీతో పాటు ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డిని పక్కకుపెట్టిన సన్‌రైజర్స్.. సచిన్ బేబితో పాటు ఇషాన్ మలింగను తుది జట్టులోకి తీసుకుంది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే కరుణ్ నాయర్(0) వికెట్‌కీపర్ ఇషాన్‌కిషన్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన డుప్లెసిస్(3) కూడా ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. ఈసారి కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన డుప్లెసిస్..కమిన్స్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. అభిషేక్ పొరెల్(8) కూడా కరుణ్, డుప్లెసిస్‌ను అనుసరిస్తూ కమిన్స్ బౌలింగ్‌లో కిషన్ క్యాచ్‌తో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 5వ ఓవర్లలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయింది.
ఈ మూడు వికెట్లు కూడా కమిన్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కిషన్ క్యాచ్‌లు పట్టడం విశేషం. భారీ ఆశలు పెట్టుకున్న రాహుల్(10), అక్షర్‌పటేల్(6), వెంటవెంటనే ఔట్ కావడంతో ఢిల్లీ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ స్టబ్స్, నిగమ్(18), అశుతోష్..హైదరాబాద్ బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ కీలక పరుగులు జతచేశారు. ముఖ్యంగా స్టబ్స్, అశుతోష్ క్రీజులో నిలదొక్కుకోవడం ఢిల్లీకి కలిసొచ్చింది.
అన్సారీ 15వ ఓవర్లో అశుతోష్ రెండు భారీ సిక్స్‌లతో చెలరేగి ఇన్నింగ్స్‌కు ఊపిరి తీసుకురాగా, హర్షల్ 17వ ఓవర్లో మరో రెండు ఫోర్లు అరుసుకున్నాడు. ఇలా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టిన ఈ ఇద్దరు ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. మలింగ ఆఖరి ఓవర్లో అశుతోష్ ఔట్ కావడంతో ఏడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. స్టబ్స్, అశుతోష్ ఆదుకోకపోతే ఢిల్లీ 100 పరుగులలోపే కుప్పకూలేది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 133/7(స్టబ్స్ 41 నాటౌట్, అశుతోష్ 41, కమిన్స్ 3/19, ఉనద్కత్ 1/19)