హైదరాబాద్, ఆట ప్రతినిధి : కాంప్లిమెంటరీ పాసుల వ్యవహారంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య నెలకొన్న వివాదం సద్దు మణిగింది. హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ సమక్షంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొని చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా.. బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ ట్రైపార్టీ ఒప్పందాన్ని కచ్చితంగా పాటించాలని, ఆ మేరకు స్టేడియం సామర్థ్యంలోని అన్ని విభాగాల్లో 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను కేటాయించాలని హెచ్‌సీఏ ప్రతిపాదించగా దానికి ఎస్ఆర్హెచ్ అంగీకారం తెలిపింది. ఉప్పల్‌లో జరుగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదం ముగిసిందని ఇరు వర్గాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.