హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రన్ నిర్వహించారు. నగరంలోని 14 కేంద్రాల నుంచి ఒలింపిక్ డే రన్ ఎల్బీ స్టేడియానికి చేరుకుంది. టెన్నిస్ కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ప్లేయర్లు సందడి చేశారు.
ఈ పరుగులో అర్జున అవార్డు గ్రహీతలకు తోడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ప్లేయర్లు పాలుపంచుకున్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ర్ట క్రీడా శాఖ మంత్రి శ్రీహరి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, టీవోఏ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సాట్స్ ఎండీ సోనీబాలదేవి తదితరులు పాల్గొన్నారు.