BCCI | దుబాయ్: బీసీసీఐ తెచ్చిన కఠిన నిబంధనలు క్రికెటర్లకు ఒక రకంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇన్ని రోజులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన క్రికెటర్లు ఇకపై బోర్డు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశీ పర్యటనలకు కుటుంబాలతో సహా వచ్చిన క్రికెటర్లు ఈసారి సింగిల్స్‌గా రావాల్సి వచ్చింది. దీనికి తోడు వ్యక్తిగత చెఫ్‌లు, భద్రతా సిబ్బంది, సహాయకులు లేకుండా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన ప్లేయర్లు ఒకింత ఇబ్బందులు పడుతున్నారు.
ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించే కోహ్లీ..స్థానికంగా ఉండే ఓ ప్రముఖ హోటల్ నుంచి స్పెషల్ ఫుడ్ తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రాక్టీస్ సెషన్ కోసం సహచర క్రికెటర్లతో కలిసి వచ్చిన కోహ్లీకి ఫుడ్ డెలీవరి వచ్చింది. అంటే టీమ్‌తో కాకుండా విరాట్ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నట్లు ఓ ప్రముఖ వార్తాసంస్థ పేర్కొంది. కోహ్లీ చేతిలో ఒక బాక్స్ కనిపించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. మొత్తంగా చీఫ్ కోచ్ గౌతం గంభీర్ సంస్కరణలు టీమ్ఇండియా రూపురేఖలను మార్చేశాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.