న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్ ఆరంభం అదిరిపోయింది. ఆరో గ్రాండ్‌స్లామ్ వేటలో అల్కరాజ్ ఆ దిశగా తొలి అడుగు వేశాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్ మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 6-4, 7-5, 6-4తో అమెరికా ప్లేయర్ రిల్లీ ఓపెల్కాపై అలవోక విజయం సాధించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వని అల్కరాజ్ వరుస సెట్లలో చిత్తు చేశాడు. ఇటీవలే యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా సాగిన సిన్సినాటీ టోర్నీ టైటిల్ గెలిచిన అల్కరాజ్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
కండ్లు చెదిరే సర్వ్‌లకు తోడు పవర్ఫుల్ రిటర్న్ షాట్లు, బేస్‌లైన్ గేమ్‌తో ఓపెల్కాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రెండు గంటల్లో ముగిసిన మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు కొట్టిన అల్కరాజ్ ఆరు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 23 విన్నర్లు సంధించిన ఈ డాషింగ్ ప్లేయర్ 17 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. మరోవైపు 14 ఏస్‌లు, 9 సార్లు డబుల్ ఫాల్ట్స్ చేసిన ఓపెల్కా 33 విన్నర్లు, 32 సార్లు తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత అల్కరాజ్ ..గోల్ఫ్ స్టార్ రోరీ మెకల్రాయ్ను అనుసరిస్తూ తనదైన శైలిలో అభిమానులను అలరించాడు. ‘అతన్ని(మెకల్రాయ్)ను కలువడం చాలా గర్వంగా ఉంది. మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ చివరి రోజు నేను మాంటెకార్లో టైటిల్ గెలిచాను. అతనితో మాట్లాడటం మరిచిపోలేని అనుభూతి. మెకల్రాయ్ ఆటకు ఫిదా అయిపోయాను’ అని అన్నాడు. ఇదిలా ఉంటే రెండో రౌండ్లో ఇటలీ ప్లేయర్ మటియా బెలుస్సీతో అల్కరాజ్ తలపడనున్నాడు.
హాంకాంగ్ యువ ప్లేయర్ కోల్మన్ వాంగ్ కొత్త చరిత్ర లిఖించాడు. ఓపెన్ ఎరాలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ గెలిచిన తొలి హాంకాంగ్ ప్లేయర్‌గా వాంగ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ 21 ఏండ్ల క్వాలిఫయర్ 6-4, 7-5, 7-6(7-4)తో కోవాసెవిచ్పై చారిత్రక విజయం సాధించాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే నాదల్ నుంచి అభినందన సందేశం అందుకున్న వాంగ్ ఈ విజయం ఎంతో విలువైనదని భావోద్వేగానికి గురయ్యాడు.
అమెరికా స్టార్ ప్లేయర్ మాడిసన్ కీస్ తన తొలి రౌండ్లోనే పోరాటాన్ని ముగించింది. హోరాహోరీగా సాగిన పోరులో కీస్ 7-6(12-10), 6-7(3-7), 5-7తో రెనాట జరాజువా(మెక్సికో) చేతిలో ఓటమిపాలైంది. మిగతా మ్యాచ్‌ల్లో పెగులా 6-0, 6-4తో షెరిఫ్(మెక్సికో)పై గెలువగా, అజరెంకా 7-6(7-0), 6-4తో ఇనౌపై, పలోని 6-2, 7-6(7-4)తో ఐవాపై గెలిచి ముందంజ వేశారు. అమెరికా వెటరన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ 3-6, 6-2, 1-6తో ముచోవా చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.