నెల రోజులుగా ఫుట్‌బాల్ అభిమానులను అమితంగా అలరించిన యూరో చాంపియన్‌షిప్ టైటిల్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 2-1తో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి పుష్కరకాలం తర్వాత ఈ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆట తొలి అర్ధభాగంలో గోల్స్ కోసం ఇరుజట్లూ హోరాహోరి తలపడి ఒక్కగోల్ చేయకున్నా మ్యాచ్ కొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఒయర్జాబల్ చేసిన గోల్‌తో స్పెయిన్ సంచలన విజయం సాధించింది. సాకర్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు.
బెర్లిన్: ప్రతిష్టాత్మక యూరో చాంపియన్‌షిప్ టైటిల్‌ను స్పెయిన్ గెలుచుకుంది. జర్మనీ వేదికగా నెలరోజులుగా జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 2-1తో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన స్పెయిన్.. తుదిపోరులోనూ చాంపియన్ ఆటతీరుతో ఇంగ్లండ్‌కు మరోసారి రిక్తహస్తమే మిగిల్చింది. ఆట తొలి అర్ధభాగంలో గోల్స్ కోసం ఇరుజట్లూ హోరాహోరిగా పోరాడినా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. కానీ రెండో అర్ధబాగంలో స్పెయిన్ తరఫున 47వ నిమిషంలో నికో విలియమ్స్ తొలి గోల్ కొట్టి ఆ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. ఇంగ్లండ్ రక్షణ శ్రేణిని చాకచక్యంగా దాటుకుంటూ యువ సంచలనం లమినె యమాల్ అందించిన బంతిని విలియమ్స్ గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. ఇంగ్లండ్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు కొలె పల్మర్ 73వ నిమిషంలో గోల్ చేసి స్కోర్లను సమం చేయడమే గాక ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు.
ఆట ముగింపు దశకు చేరుకుంటున్న వేళ స్పెయిన్ బ్యాకప్ స్ట్రైకర్ మైకెల్ ఒయర్జాబల్ అద్భుతం చేశాడు. ఆ జట్టు సారథి అల్వరొ మొరట స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒయర్జాబల్.. 86వ నిమిషంలో మెరుపు వేగంతో గోల్ సాధించి స్పెయిన్‌ను 2-1 ఆధిక్యంలోకి తెచ్చాడు. ఇక ఆ తర్వాత ఆట నిర్దేశిత సమయంతో పాటు ఎక్స్ట్రా టైమ్ (4 నిమిషాలు) లోనూ గోల్ చేయడంలో ఇంగ్లండ్ విఫలమవడంతో యూరో కింగ్స్‌గా స్పెయిన్ అవతరించింది. 1964, 2008, 2012 తర్వాత ఆ జట్టుకు ఇది నాలుగో యూరో చాంపియన్‌షిప్. ఇక 1966లో వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ఇంతవరకూ మేజర్ టైటిల్ నెగ్గని ఇంగ్లండ్ వరుసగా రెండోసారి యూరో ఫైనల్లో ఓడి నిరాశగా వెనుదిరిగింది. ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతారని ఆ జట్టు అభిమానులు భావించినా సాకర్ పుట్టినిల్లు దేశానికి నిరాశే మిగిలింది.
ఆదివారమే 17వ పుట్టినరోజు జరుపుకున్న స్పెయిన్ కుర్రాడు లమినె యమాల్ అతిపిన్న వయసులో ఈ టోర్నీ నెగ్గిన ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీని ఆరాధించే అతడు సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గోల్ కొట్టి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. స్పెయిన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన లమినె.. ఫైనల్లో తొలి గోల్ కొట్టిన విలియమ్స్‌కు బంతిని పాస్ చేశాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల నుంచి బంతిని తప్పించుకుంటూ వాళ్లను ఏమార్చాడు.టోర్నీ ఆసాంతం అదరగొట్టిన లమినెకు ‘బెస్ట్ యంగ్ ప్లేయర్’ అవార్డు దక్కింది.
1 ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా స్పెయిన్ ఏకంగా 15 గోల్స్ చేసింది. 1984లో ఫ్రాన్స్ 14 గోల్స్ చేసిన రికార్డు కనుమరుగైంది.
4 యూరోలో స్పెయిన్ టైటిల్స్. జర్మనీ (3) రికార్డును ఆ జట్టు బ్రేక్ చేసింది.