న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ గర్జించాడు. ఆదివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 6-2, 3-6, 6-1, 6-4తో టాప్‌సీడ్, డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్‌పై అద్భుత విజయం సాధించాడు. గ్రాండ్‌స్లామ్ హార్డ్ కోర్టులో సిన్నర్ 28 వరుస విజయాల పరంపరకు అల్కరాజ్ ఫుల్స్టాప్ పెట్టాడు. నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో విజయం సాధించిన అల్కరాజ్ తన కెరీర్లో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 22 ఏండ్ల అల్కరాజ్కు ఇది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.
యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్, సిన్నర్ మధ్య ఫైనల్ పోరు కొదమసింహాలను తలపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక నేపథ్యంలో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా మొదలైంది. టోర్నీలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోని అల్కరాజ్ ఒకవైపు అయితే..మరోవైపు టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో సిన్నర్బరిలోకి దిగాడు. మొదటి సెట్లో సిన్నర్ ఒకింత తడబడగా, ఇదే అదనుగా అల్కరాజ్ రెచ్చిపోయాడు. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆధిపత్యం ప్రదర్శించిన అల్కరాజ్ తొమ్మిది విన్నర్ల తొలి బ్రేక్ పాయింట్ అందుకున్నాడు. 5-2 ఆధిక్యంతో నలభై నిమిషాల్లోపే మొదటి సెట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండో సెట్లో సిన్నర్ అనూహ్యంగా పుంజుకున్నాడు. అల్కరాజ్కు దీటైన పోటీనిస్తూ సెట్‌ను దక్కించుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
ఈ క్రమంలో సిన్నర్ నుంచి ఎదురైన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అల్కరాజ్ మరో అవకాశమివ్వకుండా చెలరేగాడు. కోర్టులో చిరుతను తలపిస్తూ అల్కరాజ్ సంధించిన షాట్లకు సిన్నర్ దగ్గర సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో అల్కరాజ్ కొట్టిన బౌన్సీ షాట్ సిన్నర్‌కు అందకుండా బుల్లెట్లా దూసుకుపోయింది. 4-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో బ్రేక్ పాయింట్ దక్కించుకున్న అల్కరాజ్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్లోనూ ఎక్కడా వెనుకకు తగ్గని అల్కరాజ్ కూల్‌గా తన పని కానిచ్చాడు. మ్యాచ్‌లో 11వ ఏస్‌తో టైటిల్ విజేతగా నిలిచాడు.
1 యూఎస్ ఓపెన్ టైటిల్ ద్వారా అల్కరాజ్ నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. 65 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్న సిన్నర్‌ను రెండో ర్యాంక్‌కు పరిమితం చేశాడు.
విజేత: అల్కరాజ్ రూ.44.08 కోట్లు
రన్నరప్: సిన్నర్ రూ.22.04 కోట్లు