Champions Trophy | కరాచీ: చాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో సఫారీలు.. అఫ్గాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తూ యువ వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ (103) శతకంతో మెరవగా సారథి బవుమా (58), డసెన్ (52), మార్క్మ్ (52 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగుల భారీ స్కోరు చేసింది.
సఫారీల తరఫున గ్యారీ కిర్‌స్టెన్ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికెల్టన్ రికార్డులకెక్కాడు. అఫ్గాన్ స్పిన్ త్రయం నబీ, రషీద్, నూర్ అహ్మద్‌ను అతడు దీటుగా ఎదుర్కుని తన కెరీర్లో తొలి శతకం బాదాడు. ఇక ఛేదనలో అఫ్గాన్.. 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. రెహ్మత్ షా (90) ఒక్కడే నిలబడ్డాడు. సఫారీ పేసర్లలో రబాడా (3/36), మల్డర్ (2/36), ఎంగిడి (2/56) కాబూలీ బ్యాటర్లను కట్టడి చేశారు. రికెల్టన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.