ఇండోర్: మహిళల ప్రపంచకప్‌ను అవమానకర ఓటమితో ప్రారంబించిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదుచేసింది. మొదట బంతితో కివీస్‌ను కట్టడిచేసిన సఫారీ అమ్మాయిలు.. ఆ తర్వాత బ్యాట్‌తో కివీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కివీస్ నిర్దేశించిన 232 పరుగుల ఛేదనను దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (89 బంతుల్లో 101, 15 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగగా సునె లుస్ (81 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో 47.5 ఓవర్లలో 231 రన్స్‌కే పరిమితమైంది. సోఫీ డెవిన్ (98 బంతుల్లో 85, 9 ఫోర్లు) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్లలో బ్రూక్ హల్లీడే (45) కాస్త మెరుగ్గా ఆడింది. సఫారీ స్పిన్నర్ మ్లాబా (4/40) నాలుగు వికెట్లతో రాణించింది. కాగా కివీస్‌కు ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో పరాభవం.
న్యూజిలాండ్: 47.5 ఓవర్లలో 231 (డెవిన్ 85, బ్రూక్ 45, మ్లాబా 4/40, ట్రైయాన్ 1/24);
దక్షిణాఫ్రికా: 40.5 ఓవర్లలో 234/4 (బ్రిట్స్ 101, లుస్ 83*, అమెలియా 2/62)