బులవాయొ: దక్షిణాఫ్రికా తాత్కాలిక సారథి వియాన్ ముల్దర్ కెప్టెన్‌గా తొలి టెస్టులోనే బ్యాటుతో రికార్డుల దుమ్ముదులిపాడు. జింబాబ్వేతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ముల్దర్.. 334 బంతుల్లోనే 49 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముల్దర్ త్రిశతకంతో పాటు బెడింగ్హమ్ (82), ప్రిటోరియస్ (78) రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సఫారీలు 626/5 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. ట్రిపుల్ సెంచరీ సాధించిన ముల్దర్.. పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
టెస్టులలో ఇది ఐదో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కాగా దక్షిణాఫ్రికా తరఫున హషీమ్ ఆమ్లా (311*) తర్వాత రెండో ట్రిపుల్ సెంచరీ. 297 బంతుల్లో ముల్దర్.. 300 పరుగుల మార్కును అందుకుని సెహ్వాగ్ (278 బంతుల్లో 300) తర్వాత వేగవంతమైన త్రిశతకం చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. టెస్టుల్లో బ్రియాన్ లారా రికార్డు (400*)ను చేరుకునే అవకాశమున్నప్పటికీ దక్షిణాఫ్రికా సారథి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం గమనార్హం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే.. 170 పరుగులకే కుప్పకూలడంతో సౌతాఫ్రికాకు 456 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 51/1 స్కోరు చేసింది.