South Africa : భారత గడ్డపై పదిహేనేళ్ల తర్వాత తొలి టెస్టు విజయాన్ని రుచిచూసిన దక్షిణాఫ్రికా సిరీస్ విజయంపై కన్నేసింది. కీలకమైన గువాహటి టెస్టులోనూ గెలిచి సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది తెంబా బవుమా బ్యాచ్. ఇప్పటికే అక్కడకు చేరుకున్న సఫారీలు నెట్స్‌లో సన్నద్ధత షురూ చేశారు అయితే.. ప్రధాన పేసర్ కగిసో రబడ (Kagiso Rabada) ట్రైనింగ్ సెషన్లో పాల్గొనలేదు. అలానే ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌ను దెబ్బకొట్టిన స్పిన్నర్ సైమన్ హార్మర్ (Simon Harmer) కూడా భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. మ్యాచ్‌కు రెండు రోజులే ఉన్నందున బౌలింగ్ కోచ్ పియెట్ బొథా (Piet Botha) వీరిద్దరి గురించి త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.
తొలి టెస్టుకు ముందు ట్రైనింగ్ సెషన్లో గాయపడిన రబడ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ స్పీడ్‌స్టర్ రెండో మ్యాచ్‌లోనూ ఆడడం సందేహమే అనిపిస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రబడ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో.. గువాహటి మ్యాచ్‌లోపు ఈ పేస్ గన్ ఫిట్నెస్ సాధించాలని సఫారీ టీమ్ గట్టిగా కోరుకుంటోంది.
Kagiso Rabada still being monitored [rib injury]. We’ll take a call on his participation in the next 24 hours ~ Piet Botha, South Africa’s bowling coach#INDvSA pic.twitter.com/AQmFsqkXsB
— Cricbuzz (@cricbuzz) November 20, 2025
ఇదే విషయమై బౌలింగ్ కోచ్ బొథాను సంప్రదించగా.. ‘రబడ ఆరోగ్యాన్ని మేము పరిశీలిస్తున్నాం. ఈరోజు నెట్స్ బౌలింగ్ సెషన్స్‌లో అతడు పాల్గొనలేదు. మరో 24 గంటల్లో అతడు రెండో టెస్టులో ఆడడంపై నిర్ణయం తీసుకుంటాం. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న స్పిన్నర్ సైమన్ హార్మర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతడి భుజంతో పెద్ద సమస్యేమీ లేదు. కోల్‌కతాలో మాదిరిగానే గువాహటిలో బంతి త్వరగా టర్న్ అయిందంటే భారత లెఫ్ట్ హ్యాండర్లకు అతడు ప్రమాదకారిలా మారతాడు. మేము గువాహటి పిచ్‌ను పరిశీలించాం. వికెట్ మీద గడ్డి బాగానే ఉంది. మ్యాచ్‌కు రెండు రోజులే ఉన్నందున మరింత పశ్చికను తొలగిస్తారని కచ్చితంగా చెప్పలేను’ అని బొథా తెలిపాడు.
సిరీస్‌లో ముందంజలో ఉన్న సఫారీ టీమ్‌కు చెక్ పెట్టాలనుకున్న భారత్‌కు మ్యాచ్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో రిటైర్ట్ హర్ట్ అయిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి నుంచి కోలుకుంటున్నందున జట్టుకు దూరమయ్యాడు. దాంతో.. వైస్ కెప్టెన్ పంత్ గువాహటిలో సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ వేదికపై ఇదే మొదటి టెస్టు కావడంతో గెలిచేది ఎవరు? పిచ్ ఎలా స్పందిస్తుంది? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ᴋᴏʟᴋᴀᴛᴀ ᴛᴏ ɢᴜᴡᴀʜᴀᴛɪ ✈️
Travel 🧳 Symphony 🎵 ft. #TeamIndia#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/3aU8t0eNwr
— BCCI (@BCCI) November 20, 2025
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మొదటి టెస్టుకు దూరమైన రబడ ఆరోగ్యం గురించి టీమ్ మేనేజర్ మాట్లాడాడు. ‘మంగళవారం తొలి శిక్షణ శిబిరం సమయంలో రబడ గాయపడ్డాడు. బుధవారం ఉదయం అతడికి స్కానింగ్ పరీక్షలు జరిపాం. గురువారం రబడకు ఫిట్నెస్ టెస్టు జరిపాం. కానీ, అతడు సౌకర్యంగా కనిపించలేదు. కాబట్టే మొదటి టెస్టుకు అతడిని తీసుకోలేదు. ప్రస్తుతం రబడను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మా జట్టుకు ప్రధాన అస్త్రమైన అతడు రెండో టెస్టులోపు కోలుకుంటాడని ఆశిస్తున్నా’ అని అతడు వెల్లడించాడు.