జోహన్నెస్‌బర్గ్ : స్వదేశంలో భారత జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే దక్షిణాఫ్రికా 3-0తో చేజిక్కించుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లో సఫారీ జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఉమెన్ ఇన్ బ్లూ నిర్దేశించిన 193 పరుగుల ఛేదనను సౌతాఫ్రికా.. 16.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (53 బంతుల్లో 115, 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు సునె లుస్ (42 బంతుల్లో 64 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 183 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదుచేసి ఆ జట్టుకు భారీ విజయాన్ని అందించారు.
భారత బ్యాటర్లు ప్రత్యర్థి ఎదుట భారీ స్కోరును నిలిపినా బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. కాగా రెండేండ్ల తర్వాత భారత జట్టుకు ఇదే తొలి టీ20 సిరీస్ ఓటమి కావడం గమనార్హం. తాజా ఓటమితో టీ20 ప్రపంచకప్‌నకు ముందు తమ జట్టు లోపాలు బయటపడ్డాయని టీమ్ఇండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఈ నెల 25న ఇదే వేదికలో జరుగుతుంది.