విశాఖపట్నం: ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో (World Cup) ఆతిథ్య భారత్‌కు అనూహ్య షాక్! మెగాటోర్నీలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా (South Africa) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గురువారం సఫారీలతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో చేజేతులా ఓటమిపాలైంది. 252 పరుగుల లక్ష్యఛేదనలో 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సఫారీలు అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను తమ వశం చేసుకున్నారు. ఆశలు లేని స్థితి నుంచి అవకాశాలు సృష్టించుకుంటూ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిక్లెర్క్(54 బంతుల్లో 84 నాటౌట్, 8ఫోర్లు, 5సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీకి తోడు లారా వోల్వార్ట్ (70)అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యారు. స్నేహ్‌రానా, క్రాంతిగౌడ్ రెండేసి వికెట్లు తీశారు. తొలుత రీచా ఘోష్ (77 బంతుల్లో 94, 11ఫోర్లు, 4 సిక్స్‌లు) సాధికారిక అర్ధసెంచరీతో భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసింది. ప్రతీకా రావల్ (37), రానా (33) ఆకట్టుకున్నారు. ట్రయాన్ మూడు వికెట్లతో రాణించింది.
తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమ్ఇండియాకు మెరుగైన శుభారంభమే దక్కింది. ఓపెనర్లు ప్రతీకా రావల్(37), మందన(23) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా ప్రతీక ఆత్మవిశ్వాసం కనబరుస్తూ సఫారీ పేసర్ మారిజానె కాప్ బౌలింగ్‌లో కండ్లు చెదిరే కవర్‌డ్రైవ్‌లతో ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ నోకు మల్బా బౌలింగ్‌లో సునె లుస్కు క్యాచ్ ఇచ్చిన మందన తొలి వికెట్‌గా వెనుదిరుగడంతో 55 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లిన్ డియోల్(13) నిరాశపరిచింది.
మాల్బా బంతిని సరిగ్గా అంచనా వేయని డియోల్ క్లీన్‌బౌల్డ్ కాగా, 8 పరుగుల తేడాతో ప్రతీక మూడో వికెట్‌గా వెనుదిరిగింది. ఇక్కణ్నుంచి మన అమ్మాయిల బ్యాటింగ్ పతనం మొదలైంది. రోడ్రిగ్స్(0) వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరింది. ట్రయాన్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్ ఆడబోయిన రోడ్రిగ్స్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయింది. ఆదుకుంటారనుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(9), దీప్తిశర్మ(4) వెంటవెంటనే ఔటయ్యారు. ట్రయాన్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో పాయింట్లో కాప్ చేతికి కౌర్ చిక్కగా, దీప్తి..కీపర్ జాఫ్టా క్యాచ్‌తో ఔటైంది. దీంతో 102 పరుగులకే టీమ్ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో రీచా ఘోష్, అమన్జ్యోత్కౌర్(13) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు.
క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న వీరిద్దరు ఆ తర్వాత స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. గత మ్యాచ్‌ల్లోలాగే టాపార్డర్ విఫలమైన చోట లోయార్డర్ మరోమారు కీలకంగా వ్యవహరించింది. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 150 మార్క్ దాటింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్నేహ్‌రానా(33)..రీచాకు చక్కని సహకారం అందించింది. వీరిద్దరు సఫారీ బౌలర్లను దీటుగా నిలువరిస్తూ బౌండరీలతో ఆకట్టుకున్నారు. అప్పటి వరకు సింగిల్స్‌కు పరిమితమైన రీచా..తనదైన శైలిలో భారీ షాట్లకు విరుచుకుపడింది. ఒక దశలో కనీసం 200 పరుగులైనా చేరుకుంటుందా అన్న తరుణంలో రీచా, రానా కలిసి 250 స్కోరు సాధించారు. మొదటి 40 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన టీమ్ఇండియా మిగిలిన 10 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో రీచా..డిక్లెర్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరుగగా, శ్రీచరణి(0) పరుగుల ఖాతా తెరువలేకపోయింది.
నిర్దేశిత 252 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీల పోరాటం ఆకట్టుకుంది. గత మ్యాచ్‌లో సెంచరీతో అరదగొట్టిన తజ్మిన్ బ్రిట్స్(0) ఈసారి ఘోరంగా నిరాశపర్చగా, సున్ లుస్(5) సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమైంది. బ్రిట్స్‌ను క్రాంతిగౌడ్..సూపర్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపగా, లుస్ను అమన్జ్యోత్కౌర్ రెండో వికెట్‌గా సాగనంపింది. ఈ స్థితిలో కెప్టెన్ లారా వోల్వార్ట్(70), కాప్(20) ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నారు. అయితే కాప్‌ను రానా క్లీన్‌బౌల్డ్ చేయగా, బాచ్(1) జాఫ్టా(14)పేలవ ప్రదర్శనతో వెనుదిరుగడంతో దక్షిణాఫ్రికా 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఓవైపు సగం వికెట్లు కోల్పోయిన జట్టును వోల్వార్ట్, ట్రయాన్(49) ఒడ్డున పడేశారు.
టీమ్ఇండియా బౌలింగ్ దాడిని కాచుకుంటూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించే ప్రయత్నం చేశారు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన క్రాంతి..వోల్వార్ట్ను ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. డిక్లెర్క్ ఎంట్రీతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ట్రయాన్ జతగా డిక్లెర్క్ దూకుడుగా ఆడింది. వీరిని విడదీసేందుకు కెప్టెన్ కౌర్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. ట్రయాన్ ఔటైనా తన ఇన్నింగ్స్‌లో ఐదు భారీ సిక్స్‌లకు తోడు ఎనిమిది ఫోర్లతో డిక్లెర్క్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. అమన్‌జ్యోత్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో భారత గెలుపు ఆశలపై నీళ్లు గుమ్మరించింది.
భారత్: 49.5 ఓవర్లలో 251 ఆలౌట్(రీచా ఘోష్ 94, ప్రతీక 37, ట్రయాన్ 3/32, కాప్ 2/45),
దక్షిణాఫ్రికా: 48.5 ఓవర్లలో 252/7(డిక్లెర్క్ 84 నాటౌట్, వోల్వార్ట్ 70, రానా 2/47, క్రాంతి 2/59)