టీ20 ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. ఆఖరి బంతి వరకు ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి అయ్యింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సఫారీలు..ఇంగ్లండ్‌పై ఉత్కంఠ విజయంతో అనధికారికంగా సెమీస్ బెర్తు దక్కించుకున్నారు. క్వింటన్ డికాక్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో పోరాడే స్కోరు అందుకున్న దక్షిణాఫ్రికా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. లక్ష్యఛేదనలో బ్రూక్, లివింగ్‌స్టోన్ అద్భుత పోరాటం ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయింది.
T20 World Cup | గ్రాస్ఐస్లెట్(సెయింట్ లుసియా): టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫైట్ సమీపిస్తున్న వేళ అత్యుత్తమ జట్ల మధ్య పోరాటం అభిమానులకు పసందైన విందు అందిస్తున్నది. శుక్రవారం ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే..తొలుత క్వింటన్ డికాక్(38 బంతుల్లో 65, 4ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 43, 4ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో సఫారీలు 20 ఓవర్లలో 163/6 స్కోరు చేశారు. ఆర్చర్(3/40) మూడు వికెట్లుతో ఆకట్టుకున్నాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకు పరిమితమైంది. బ్రూక్(37 బంతుల్లో 53, 7ఫోర్లు), లివింగ్‌స్టోన్(17 బంతుల్లో 33, 3ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఒక దశలో వీరిద్దరి బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ గెలుస్తుందనుకున్నా..సఫారీల సమిష్టితత్వం ముందు ఓటమివైపు నిలువాల్సి వచ్చింది. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
డికాక్ ధనాధన్: ఓపెనర్లు డికాక్, రెజా హెండ్రిక్స్(19) దక్షిణాఫ్రికాకు అదిరిపోయే ఆరంభం అందించారు. సూపర్ ఫామ్‌మీదున్న డికాక్ బౌండరీలతో దుమ్మురేపాడు. అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్‌తో మొదలుపెట్టిన డికాక్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ఆర్చర్ వేసిన నాలుగో ఓవర్లో డికాక్ విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండు భారీ సిక్స్‌లకు తోడు ఫోర్‌తో దుమ్మురేపాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో తొలి వికెట్‌కు దక్షిణాఫ్రికాకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కాగా డికాక్ 22 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని హెండ్రిక్స్‌ను ఔట్ చేయడం ద్వారా అలీ విడగొట్టాడు. దీంతో తొలి వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవర్ తేడాతో ఆర్చర్ బౌలింగ్‌లో డికాక్..బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్లాసెన్(8), కెప్టెన్ మార్క్మ్(్ర1) వెంటవెంటనే నిష్క్రమించారు. స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందనుకున్న సఫారీలు మిల్లర్ బ్యాటింగ్‌తో పోరాడే స్కోరు అందుకుంది. స్టబ్స్(12 నాటౌట్)తో కలిసి మిల్లర్ దూకుడు కనబరిచాడు.
బ్రూక్, లివింగ్‌స్టోన్ మెరిసినా: లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు సరైన శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్ హీరో ఫిల్ సాల్ట్(11) ఓ సిక్స్, ఫోర్‌తో దూకుడు మీద కనిపించినా..రబాడ బౌలింగ్‌లో హెండ్రిక్స్ సూపర్ క్యాచ్‌తో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బట్లర్(17), బెయిర్‌స్టో(16), అలీ(9) ఫర్వాలేదనిపించారు. మ్యాచ్‌పై అప్పటికే పట్టు బిగించిన సఫారీలకు బ్రూక్, లివింగ్‌స్టోన్ ఎదురొడ్డి నిలిచారు. 14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ విజయానికి 36 బంతుల్లో 77 పరుగుల దూరంలో ఉంది. ఇక్కణ్నుంచి బ్రూక్, లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ అంతకంతకు కరిగించే ప్రయత్నం చేశారు. అయితే రబాడ 18వ ఓవర్లో లివింగ్‌స్టోన్ ఔటైతే..నోకియా 20వ ఓవర్ తొలి బంతికి మార్క్మ్ సూపర్ క్యాచ్‌తో బ్రూక్ ఇన్నింగ్స్ ముగిసింది. సామ్ కరాన్(10 నాటౌట్) గెలిపించేందుకు చేసిన ప్రయత్నం నెరవేరలేదు.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 163/6(డికాక్ 65, మిల్లర్ 43, ఆర్చర్ 3/40, రషీద్ 1/20),
ఇంగ్లండ్: 156/6(బ్రూక్ 53, లివింగ్‌స్టోన్ 33, మహారాజ్ 2/25, రబాడ 2/32)