కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మెగాటోర్నీలో ముందంజ వేయాలంటే గెలువాల్సిన మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గ్రూపు-బీ టాపర్‌గా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 29.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేశారు.
డస్సెన్(72 నాటౌట్), క్లాసెన్(64) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని నిలువరిస్తూ డస్సెన్, క్లాసెన్ వీరవిహారం చేశారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్చర్(2/55) రెండు వికెట్లు తీశాడు.
తొలుత జాన్సెన్(3/39), ముల్దర్(3/25) ధాటికి ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకు పరిమితమైంది. జోరూట్(37) టాప్ స్కోరర్‌గా నిలువగా, కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన బట్లర్(21) నిరాశపరిచాడు. జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సెమీస్‌లో గ్రూపు-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో దక్షిణాఫ్రికా తలపడుతుంది.