IND Vs SA | కోల్‌కతాలో జరిగిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు ఇద్దరికీ సహకారం అందించినా వివాదానికి దారి తీసింది. అయితే, టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్‌పై స్పందించేందుకు నిరాకరించాడు. జట్టు కోరుకున్న వికెట్ అదేనని తెలిపాడు. ఈ క్రమంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ వ్యవహారంపై స్పందించాడు. గంభీర్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్కు పలు సూచనలు చేశారు.
జట్టు మేనేజ్మెంట్ ఏకపక్ష పిచ్‌ను సిద్ధం చేయాల్సిన అవసరం లేదని.. టీమ్ మేనేజ్మెంట్ సైతం జట్టు బౌలర్లపై నమ్మకం ఉంచాలని సూచించాడు. కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు మేనేజ్మెంట్ క్యూరేటర్‌ను అలాంటి పిచ్‌ను సిద్ధం చేయమని కోరినట్లు గంగూలీ వెల్లడించారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని.. అయితే, ఇది అత్యుత్తమ టెస్ట్ పిచ్ కాదన్నారు. భారత్ కనీసం 120 పరుగులు చేసి ఉండాల్సిందని పేర్కొన్నాడు. గంభీర్ స్వయంగా తనకు అలాంటి పిచ్ కావాలని చెప్పాడని.. క్యూరేటర్‌కు కూడా సూచించినట్లుగా గంగూలీ తెలిపాడు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో చేసిన అదే తప్పును మరోసారి చేసింది. మూడు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లను తయారు చేసినా.. టీమిండియా 3-0 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఆ సిరీస్ నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకోకుండా.. గత ఆరు నెలల్లో స్వదేశంలో జరిగిన ఆరు టెస్టుల్లో నాలుగింట్లో ఓడిపోయింది.
మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ పిచ్ భారత జట్టు కోరుకున్నదేనని ఒప్పుకున్నాడు. కానీ, గంభీర్ వ్యాఖ్యలను గంగూలీ అంగీకరించలేదు. తాను గంభీర్‌ను గౌరవిస్తానని.. ఇంగ్లండ్‌లో వన్డేలు, టీ20ల్లో టీమిండియా అద్భుతంగా అతని పర్యవేక్షణలో రాణించింది. కానీ, మనం మంచి, సమతుల్య పిచ్‌లపై ఆడాలని సూచించాడు గంగూలీ. బౌలర్లను, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి మ్యాచ్ విన్నర్లను విశ్వసించాలంటూ చెప్పాడు. ‘మనం బుమ్రా, సిరాజ్, షమీలను నమ్మాలి. మన స్పిన్నర్లు కూడా టెస్టులు గెలుస్తారు. పిచ్‌ను ఏకపక్షంగా మార్చాల్సిన అవసరం లేదు’ అని తెలిపాడు. చివరగా గంగూలీ మాట్లాడుతూ ‘మూడు రోజుల్లో కాదు.. ఐదురోజుల్లో టెస్టు మ్యాచులు గెలవండి’ అంటూ హితవు పలికాడు. బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించే పిచ్‌లపై భారత్ ఆడాలని, ఆటను ఉత్తేజపరిచేలా, సమతుల్య పరిస్థితుల్లో జట్టు గెలవడం నేర్చుకోవాలని కోరుకుంటున్నట్లుగా గంగూలీ స్పష్టం చేశాడు.