Sourav Ganguly : భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly ) కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఐపీఎల్లో మెంటార్‌గా కొనసాగుతున్న దాదా తాజాగా ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (Indian Racing Festival)లో ఓ జట్టును కొనేశాడు. ‘కోల్‌కతా రాయల్ టైగర్స్ రేసింగ్ టీమ్'(Kolkata Royal Tigers Racing Team)ను గంగూలీ హస్తగతం చేసుకున్నాడు. ఈ రేసింగ్ పోటీలో ఒక ఫ్రాంచైజీకి యజమాని కావడం సంతోషంగా ఉందని భారత మాజీ సారథి అన్నాడు.
‘కోల్‌కతా జట్టుతో ఇండియన్ ఫెస్టివల్లో భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని గంగూలీ తెలిపాడు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో కోల్‌కతా జట్టు పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఆగస్టు నెలలో మూడో సీజన్ కార్ల పందెం ప్రారంభం కానుంది.

దాదాపు మూడు నెలల వరకూ జరిగే మోటార్ రేసింగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL) నిర్వహిస్తున్న ఈ రేసింగ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL), ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ (F4IC) అనే రెండు రకాల చాంపియన్‌షిప్స్ పోటీలు ఉంటాయి.
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ మూడో సీజన్లో దేశంలోని ప్రధాన నగరాలకు చెందిన ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, గోవా, కొచ్చి, అహ్మదాబాద్ టీమ్‌లు రయ్.. రయ్ మంటూ ట్రాక్ మీద దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
#ContestAlert! The newest team on the block will walk the grid with a legend from the City of Joy.
Share your answers & stand a chance to win exclusive merch!#SpeedMeetsSpirit #IndianRacingFestival #IndianRacingLeague #F4IC #IndianRacing #Formula4 #IndianF4 #Motorsports pic.twitter.com/LGbv2GkzTB
— Indian Racing League Official (@Irlofficial1) July 8, 2024
‘కోల్‌కతా ఫ్రాంచైజీని సౌరభ్ గంగూలీ సొంతం చేసుకున్నారని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ఎంతో విజయవంతమైన దాదా రాకతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ మరింత కొత్తగా ఉండనుంది. భారత దేశంలో మోటార్ స్పోర్ట్స్‌ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువతకు గంగూలీ స్ఫూర్తిగా నిలుస్తాడు.

అంతేకాదు ఈ దిగ్గజ క్రికెటర్ ఫ్రాంచైజీ కొనడంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌కు భారీ స్థాయిలో ప్రచారం లభిస్తుంది’ అని రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి వెల్లడించాడు. అయితే.. కోల్‌కతా రేసింగ్ టీమ్ ఫ్రాంచైజీ కోసం గంగూలీ ఎంత ఖర్చు చేశాడు? అనేది తెలియాల్సి ఉంది.