County Championship : క్రికెట్లో అప్పుడప్పుడూ ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో ఆఖరి వికెట్ తీసేందుకు బౌలింగ్ జట్టు తెలివిగా వ్యూహాలు పన్నడం చూశాం. స్లిప్, గల్లీ, సెకండ్ స్లిప్, పాయింట్.. ఇలా నలుగురు నుంచి ఐదుగురు ఫీల్డర్లను బ్యాటర్ చుట్టూ మోహరిస్తుంది. అయితే.. కౌంటీ చాంపియన్‌షిప్(County Championship)లో ఓ జట్టు మాత్రం మొత్తం ఫీల్డర్లను క్రీజు చుట్టూరా మోహరించింది. ఇంకేముంది.. క్షణాల్లోనే ఆఖరి వికెట్ లభించింది. అంతే.. ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
కౌంటీ చాంపియన్‌షిప్ 59వ మ్యాచ్‌లో సర్రే(Surrey), సోమర్సెట్(Somerset) జట్లు తలపడ్డాయి. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ జాక్ లీచ్(5/37) విజృంభణతో సర్రే జట్టు మిడిలార్డర్ కుప్పకూలి ఆలౌట్ ప్రమాదంలో పడింది. డానియల్ వొర్రాల్(Daniel Worrall) ఆఖరి బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. అతడి వికెట్ తీసేందుకు కెప్టెన్ లెవిస్ గ్రెగరీ ఫీల్డింగ్‌లో మార్పులు చేశాడు.
❤️ Cricket ❤️#SOMvSUR#WeAreSomerset pic.twitter.com/S7IrAEMezz
— Somerset Cricket (@SomersetCCC) September 12, 2024
జాక్ లీచ్ బౌలింగ్‌కు సిద్ధం కాగానే మొత్తం 10 మందిని క్రీజు చుట్టూ పెట్టాడు. లీచ్ విసిరిన బంతిని అడ్డుకునే ప్రయత్నం చేసినా అతడి వల్ల కాలేదు. దాంతో, లీచ్ సహా సోమర్సెట్ ఆటగాళ్లంతా ఎల్బీ అప్పీల్ కోసం అంపైర్ వైపు తిరిగారు. అప్పటికే అంపైర్ వేలు పైకెత్తాడు. అంతే.. సోమర్సెట్ జట్టు 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సంచలన బౌలింగ్ చేసిన జాక్ లీచ్‌ను సహచరులు అభినందనల్లో ముంచెత్తారు.