న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం కొంతమంది నిర్వాహకులు ‘ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్(ఐహెచ్పీఎల్)కు తెరతీశారు. అక్కడి ప్రభుత్వ సహకారంతో మొత్తం ఎనిమిది జట్లతో లీగ్‌కు ప్రణాళికలు రచించారు. లీగ్‌కు అంతర్జాతీయ ఆకర్షణ తీసుకొచ్చేందుకు స్టార్ క్రికెటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో వెస్టిండీస్ హార్డ్‌హిట్టర్ క్రిస్ గేల్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జెస్సీ రైడర్, శ్రీలంకకు చెందిన తిసారా పెరెరా లాంటి వారితో లీగ్‌కు రూపకల్పన చేశారు.
రాష్ట్ర క్రీడా అథారిటీలతో కలిపి స్వచ్చంద సంస్థ యువ సొసైటీ ఐహెచ్పీఎల్ను గత నెల 25 నుంచి ఈనెల 8 వరకు నిర్వహించేందుకు సిద్ధమైంది. భక్షి స్టేడియం వేదికగా మ్యాచ్‌లు నిర్వహించేందుకు భారీగానే ఏర్పాట్లు చేశారు.
స్టార్ క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు టికెట్లను కొనుగోలు చేశారు. మొదట సాఫీగానే జరిగినా ఆ తర్వాత స్పాన్సర్లు చేతులెత్తేయడంతో లీగ్ నిర్వహణ తలకిందులైంది. చేసేదేమి లేక నిర్వాహకులు ఉన్నఫళంగా పెట్టేబేడ సదురుకోని వెళ్లిపోయారు. లీగ్ ఆడేందుకు వచ్చిన గేల్‌తో పాటు పలువురు క్రికెటర్లు, అంపైర్లు బస చేసిన హోటల్ బిల్లులు కూడా కట్టకుండా వెళ్లిపోయారు.
స్పాన్సర్ల ఆర్థికపరమైన సమస్యలతో ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. దీనిపై అక్కడి స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మేము టికెట్ల కోసం పెట్టిన డబ్బులు తిరిగి ఇస్తారా లేదా అనేది తెలియడం లేదని పలువురు అభిమానులు వాపోయారు. ఇలా లీగ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో కశ్మీర్ అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చిందని బీజేపీ ఆరోపించింది.