Smriti Mandhana : భీకర ఫామ్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ఏడాదిలో నాలుగు శతకాలతో రికార్డు నెలకొల్పిన ఈ సొగసరి బ్యాటర్.. మరో రికార్డు తన పేరిట రాసుకుంది. ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులతో చరిత్ర సృష్టించిందీ డాషింగ్ ఓపెనర్.
స్వదేశలో జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ రెండు మ్యాచుల్లో విఫలమైన మంధాన.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్న మంధాన 972 పరుగులతో ఆస్ట్రేలియా దిగ్గజం బెలిండా క్లార్క్ (Belinda Clark) రికార్డును బద్ధలు కొట్టింది.
🚨 SMRITI MANDHANA BROKE 28 YEAR OLD RECORD IN ODIs 🚨
– Smriti has most runs in a Calendar year in ODI History. 🇮🇳
The Queen of Indian Cricket.#TeamIndia #SmritiMandhana pic.twitter.com/SpAjjc3uft
— Indian Women Cricket | WPL #WPL2026 (@BCCIWomenLIVE) October 9, 2025
వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలతో కదం తొక్కిన మంధాన ఆసీస్ వెటరన్ క్లార్క్ రికార్డుకు దగ్గరైంది. సఫారీలతో మ్యాచ్‌లో ఆమె 1997లో 970 పరుగులతో క్లార్క్ నెలకొల్పిన ఆల్‌టైమ్ రికార్డును బద్ధలు కొట్టింది. ప్రస్తుతానికి వన్డేల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగుల రాణుల జాబితాలో మంధాన టాప్‌లో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ 2022లో 882 రన్స్‌తో మూడో స్థానంలో ఉంది. డెబ్బీ హాక్లే (న్యూజిలాండ్) 1997లో 880 రన్స్‌తో నాలుగో స్థానంలో నిలవగా.. 2016 లో ఆ దేశానికే చెందిన అమీ సటెర్వైటీ 853 పరుగులతో ఐదో స్థానం దక్కించుకుంది.