Team India | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో చివరిది. మూడవ వన్డే ఆదివారం జరుగనున్నది. చెరో మ్యాచ్ గెలుచుకోవడంతో సిరీస్ సమం అయింది. మూడో వన్డేలో గెలుపొందిన టీమ్‌కే సిరీస్ సొంతం అవుతుంది. తొలి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 110 పరుగులకే కుప్పకూల్చిన టీం ఇండియా.. తనకు ఇష్టమైన లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో ఆదివారం జరిగే మూడో వన్డే కీలకం కానున్నది. ఫైనల్ వంటి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను వడిసి పట్టాలని టీం ఇండియా పట్టుదలతో ఉన్నది. రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
తొలి వన్డేలో పిచ్ బౌలింగ్‌కు సహకరించడంతో గెలుపొందిన టీం ఇండియా.. లార్డ్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఘోరంగా విఫలమయ్యారు. బ్యాట్స్మన్లు క్రీజ్‌లో నిలకడగా నిలబడి బ్యాటింగ్ చేయలేకపోయారు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ పర్వాలేదనిపించడంతో టీం ఇండియా 146 పరుగులైనా చేయగలిగింది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి వన్డేలో ఆత్మ విశ్వాసం ప్రదర్శించిన సారధి రోహిత్ శర్మ.. రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖార్ ధావన్‌ది అదే పరిస్థితి. కొద్దిగా మెరుపులు మెరిపించినా విరాట్ కోహ్లీ 16 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పటికే కోహ్లీ ఫామ్‌లో లేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
మూడో వన్డేలోనైనా విరాట్ కోహ్లీ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిందేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. రెండో వన్డేలో 150 పరుగుల్లోపే ఆరు వికెట్లు తీసిన టీం ఇండియా బౌలర్లు.. టెయిలెండర్ల ఆట కట్టించడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఇంగ్లండ్ 246 పరుగులు చేయగలిగింది. ముందే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని అనుకుంటున్నారు. రెండో వన్డేలో చెలరేగిన స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీశాడు. మూడో వన్డేలోనూ ఇంగ్లండ్ బ్యాట్స్మన్లకు కళ్లెం వేస్తేనే సిరీస్‌ను టీం ఇండియా గెలుచుకోగలుగుతుంది.