టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంతిని మరీ బలంగా బాదడానికి ప్రయత్నించడు. టెక్నికల్‌గానే ఆడుతూ ఫీల్డ్‌లో గ్యాప్స్‌లోకి షాట్లు ఆడుతూ పరుగుల వరద పారించడం కోహ్లీ స్పెషాలిటీ. అలాంటి వాళ్లపై స్లోబాల్ పనిచేయదట. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు టీమిండియా స్లోబాల్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్.
గతేడాది జరిగిన ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన హర్షల్.. గాయం నుంచి కోలుకున్న తర్వాత పేలవ ప్రదర్శనతో విమర్వల పాలవుతున్నాడు. అయితే తాజాగా తన బౌలింగ్ గురించి వివరించాడు. మ్యాచ్ ఆడే వేదిక, వాతావరణం, మంచు ప్రభావం తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తను స్లో బాల్స్ వేస్తానని హర్షల్ వెల్లడించాడు.
‘కోహ్లీ వంటి వాళ్లు మాత్రం స్లోబాల్‌కు బుట్టలో పడరు. ఎందుకంటే తను బౌండరీ కోసం బంతిని బలంగా బాదడమే పనిగా పెట్టుకోడు. ఈ విషయం తనకు ప్రత్యర్థిగా ఆడినప్పుడు చాలా సార్లు గమనించా. నేను స్లోబాల్ వేసినప్పుడల్లా క్రీజులో ముందుకొచ్చి దాన్ని ఫుల్టాస్లా ఆడేస్తాడు కోహ్లీ. మిడ్‌వికెట్ మీదుగా బంతిని మరలిస్తాడు. బ్యాట్ సరిగా తగిలితే బౌండరీ వస్తుంది. లేదంటే రెండు పరుగులు గ్యారంటీ.
అయితే క్రీజులో డీప్‌గా వెళ్లి లాంగాన్, డీప్ మిడ్‌వికెట్ లేదా స్ట్రెయిట్‌గా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు స్లోబాల్ మ్యాజిక్‌లా పనిచేస్తుంది’ అని హర్షల్ వివరించాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో బుమ్రా ఆడకపోవడంతో హర్షల్‌పై కూడా ఒత్తిడి పెరిగింది. అతను ధారాళంగా పరుగులిస్తుండటంతో నెట్టింట అతను తెగ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే.