చిన్ని కృష్ణుడంటే వల్లమాలిన అభిమానం చాలామంది తల్లులకు. వన్నెచిన్నెల ఆ చిన్నారి తన గర్భంలో జన్మిస్తే ఆనందించాలన్న తపన. అందరూ యశోదమ్మలు కాలేకపోయినా, శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు తమ బిడ్డనే చిన్ని కృష్ణుడిగా భావించి ముచ్చటగా ముస్తాబు చేసి తెగ మురిసిపోతుంటారు.
ఆ మాతృ ప్రేమను మరింత ప్రతిబింబించేలా, కాబోయే అమ్మలకు చేసే సీమంతం వేడుకలోనూ ఇప్పుడు ముద్దుల కన్నయ్య మెరిసిపోతున్నాడు. సీమంతం పెండ్లి కూతురు, చీరతో పాటు ధరించేలా యశోదా తనయుడి చిత్రాన్ని కొలువుదీర్చిన శాలువాలు, దుపట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి.
శాటిన్, రేయాన్లాంటి వస్ర్తాలతో తయారై, బంగారు రంగు లేస్తో వస్తున్నాయివి. యశోదా కృష్ణులు, చిన్నికృష్ణుడు, వేణువు, నెమలి పింఛం, కన్నయ్య పాదాలు, శుభకరమైన శ్లోకాలు, మంత్రాలు… ఇలా ముకుందుడికి సంబంధించిన ముద్రలెన్నో దాని మీద ఉంటున్నాయి. బొజ్జలో ఉండే చిన్నారికి… చిన్ని కృష్ణుడి రక్ష అన్నమాట ఈ పైచెరగులు!