ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన సలహాలు, సూత్రాలు చూస్తే, పాపం చదువు చెప్పే గురువులకే మైండ్ బ్లాంక్ అయిపోయుంటది. ‘ఒక రెండేళ్ల దాకా మీ ధర్నాలు, ర్యాలీలు పక్కనపెట్టి సైలెంట్‌గా ఉండండి.. వెసులుబాటును బట్టి నేనే చూసుకుంటా. పిల్లల ముందట సర్కార్ ఇజ్జత్ తీయకుండ్రి’ అని ఏకంగా టీచర్స్ డే వేడుకల్లోనే డైలాగ్ కొట్టేసరికి టీచర్లు లోపల లోపల నవ్వుకున్నరట.
‘మీ కాంగ్రెస్ సర్కార్ల మీ సీటుకే గ్యారెంటీ లేదని మీ సొంత పార్టీవోళ్లే సణుక్కుంటాంటే, ఈ మిగిలిన రెండేండ్ల తర్వాత నువ్వు మాకేం ఒరగబెడుతవు సారూ?’ అని టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో ఉండేదే రెండేండ్లు, ఇగ రెండేండ్ల దాకా ఏమీ అడగొద్దనడం ఏందో ఈ ఇచ్ఛంత్రం ఆఫర్!
సరేలే అని, ‘మీరు చెప్పినట్టే ఈ రెండేండ్లు మా హక్కుల కోసం ధర్నాలు చేయం, కానీ మాదొక చిన్న కండిషన్!’ అంటూ ఉపాధ్యాయులు పెట్టాలనుకుంటున్న రివర్స్ ఆఫర్ తెలిస్తే సర్కార్‌కు చెమటలు పట్టాల్సిందే. అదేంటంటే.. ‘మా డీఏలు, బకాయిలు, పీఆర్సీ బిల్లులు క్లియర్ అయ్యేంత వరకు మీరు, నీ మంత్రులు జీతాలు, భత్యాలు బంద్ పెట్టి ఫ్రీగా పనిచేయుండ్రి మా బకాయిలు తీరినంకనే మీ బిల్లులు డ్రా చేసుకోండి! మీ మాటలు కోటలు దాటుతయి కానీ, సమస్యలు మాత్రం తీర్చరు’ అని టీచర్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. లేకపోతే.. రెండేండ్లు నోర్మూసుకోండ్రి అంటే ఊకుంటరా!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడొకటే లొల్లి.. అదేంటంటే, కాంగ్రెస్ వెయ్యి దినాల ముచ్చట! అధికారంలోకి వచ్చి వెయ్యి దినాలైనయి కదా! ఇంకేమున్నది, మీరిచ్చిన 420 హామీల ఆరు గ్యారెంటీలు ఏమైయినయ్? అంటూ గులాబీ దళం రోడ్డెక్కి నిరసన దీక్షలు, ధర్నాలు చేస్తున్నది. ప్రజల్లో మస్తు జోష్ పెంచి, సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ గట్టిగానే గళం ఎత్తుతున్నది.
ఇక ఈ హడావుడి చూసి తట్టుకోలేకనో ఏమో, కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం ఎప్పట్లాగే పొలిటికల్ రెజ్లింగ్ స్టార్ట్ చేశారు. ఆఫీసుల మీద దాడి చేసుకోవడాలు, టీవీల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవడాలు చూస్తుంటే.. వీళ్లది నిజమైన శత్రుత్వమా లేక ఫిక్సింగ్ మ్యాచా అని డౌట్ వస్తున్నది. విశ్లేషకులు కూడా ఇదే అంటున్నరు! గులాబీ పార్టీ హవా పెరిగి, జనం కష్టాల మీద నిలదీస్తుంటే.. ఆ అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్’ తెరపైకి తెచ్చినట్టున్నారు.
నిరుద్యోగం, రైతు గోస, సంక్షేమ పథకాల జాడ లేకపోవడం వంటి అసలు సమస్యల నుంచి జనం చూపును పక్కకు తిప్పడానికే ఈ రాళ్లాటలు, దాడుల డ్రామాలు. అసలు సంగతేంటంటే, ప్రాంతీయ పార్టీ మళ్లీ బలపడుతుందనే భయంతో ఆ రెండు జాతీయ పార్టీలు కలిసే ఈ మైండ్ గేమ్‌కు తెరలేపినట్టు కనిపిస్తున్నది. ఏదేమైనా.. రాజకీయం ఏదైనా, బలి అయ్యేది మాత్రం మన జనమే కదా!

టీడీపీ షర్ట్ విప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కొత్త రోజుల్లో… రేవంత్‌రెడ్డికి అండగా నిలిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో డాక్టర్ జీ.చిన్నారెడ్డి ఒకరు. అప్పట్లో సొంత పార్టీలోనే రేవంత్‌ను గద్దించిన వాళ్లుంటే,. వెనుకేసుకొచ్చిన నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రం లో మంత్రి. అలాంటి సీనియర్ నాయకుడికి కాంగ్రెస్ గెలిచిన తర్వాత క్యాబినెట్ హోదాతో ‘ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్’ పదవి కట్టబెట్టింది.
అనుభవం ఉన్నోడికి పదవి ఇస్తే ప్లానింగ్ అదుర్స్ అనుకున్నారు అందరూ. కానీ ఏమైందో ఏమో గానీ, సీన్ కట్ చేస్తే… సడన్‌గా ఆ ప్లానింగ్ బోర్డు పదవి కింద కుర్చీ లాగేశారు ఇప్పుడు. ఎప్పట్నుంచో కాంగ్రెస్‌లోనే ఉన్న చిన్నారెడ్డికి ఇలాంటి ‘ట్రీట్మెంట్’ తగునా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ ఆఫీస్ గాంధీభవన్‌లో హాట్ టాపిక్ అయింది.
కష్టపడ్డ వాళ్లకు, కాలం కలిసి రాని వాళ్లకు కాంగ్రెస్‌లో దక్కే మర్యాద ఇదేనా అని చిన్నారెడ్డి అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అవతలి పార్టీల నాయకులు సైతం, ‘పాపం, ఆ మాత్రం గౌరవం కూడా దక్కలేదా?’ అని సానుభూతి చూపిస్తున్నరు. మొత్తానికి, రేవంత్ రాజకీయంలో ప్లానింగ్ డెవలప్మెంట్ ఎంతుంటుందో తెలియదు కానీ, అవకాశవాదం మాత్రం అపరిమితమనే అంటున్నరు. రేవంత్‌రెడ్డిని నెత్తిన పెట్టుకున్న అసలు కాంగ్రెస్ నాయకుడికి భలే ట్రీట్మెంట్ దొరికింది అని మరికొందరు సెటైర్లు వేస్తున్నరు.

చాలా రోజుల నుంచి నడుస్తున్న ‘మంత్రి పదవి ముచ్చట’ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది! ఏడాది కాలంగా సురేఖను గద్దె దించడానికి తెరవెనుక, తెరముందు జరిగిన గుసగుసలు, ప్రయత్నాలు ఫలించి.. సీఎం తాను అనుకున్నంత పని చేశారు. ఈ మంత్రాంగం చూసి కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకుల మైండ్ బ్లాక్ అయిపోయిందట! పదవి ఊడినా సరే, సురేఖ మాత్రం హైకమాండ్‌ను పల్లెత్తు మాట అనకుండా, నేరుగా రేవంత్‌నే టార్గెట్ చేస్తూ లెక్కలేసుకుని మరీ మాట్లాడుతున్నరు.
దీన్ని బట్టి చూస్తే కొండా సురేఖ ప్లాన్ ఏంటా అనే ఆసక్తి కలుగుతున్నది. ‘పార్టీని వీడే ప్రసక్తే లేదు, ప్రస్తుతానికి ఎమ్మెల్యేగానే ఉండి అంతు తేలుస్తా’ అని సంకేతాలు బాహాటంగానే పంపుతున్నరు.
ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతున్నది. సురేఖను సాగనంపి రేవంత్ గెలిచేశానని సంబురపడుతుంటే, విశ్లేషకులు మాత్రం ‘అసలైన సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది’ అని నవ్వుకుంటున్నారు. క్యాబినెట్లో ఖాళీ అయిన ఆ ఒక్క కుర్చీని భర్తీ చేయడం ఇప్పుడు కాంగ్రెస్‌కు కత్తి మీద సాము లాంటిదే! పార్టీలో మినిస్టర్ పోస్టుల కోసం ఆశపడే సీనియర్లు, జూనియర్లు లైన్లో ఉన్నారు. ఒక్క పోస్టు కోసం పదుల సంఖ్యలో నేతలు క్యూ కట్టారు.
పదవి రానోళ్లు ఎర్రటి కోపంతో అలకపాన్పు ఎక్కితే, రేవంత్ సర్కార్ ఆ లొల్లిని ఎలా తట్టుకుంటుందో ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క సురేఖ మ్యాటరే ఇంత రగడ చేస్తే, మున్ముందు రాబోయే క్యాబినెట్ కుదుపులను మన లీడర్ ఎలా చల్లార్చుతారో వేచి చూడాల్సిందే!
-దాము నర్మాల