హైదరాబాద్, ఆట ప్రతినిధి: తైపీ వేదికగా జూన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ సాఫ్ట్‌బాల్ టోర్నీకి ఆరుగురు ఎస్సీ గురుకుల విద్యార్థులు భారత జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ సాఫ్ట్‌బాల్ సమాఖ్య గురువారం 16 మందితో భారత టీమ్‌ను ప్రకటించగా, అందులో మన గురుకుల ప్లేయర్లే ఉండటం విశేషం.
జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సాఫ్ట్‌బాల్ ప్లేయర్లు ఆసియా టోర్నీలోనూ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న వీరు తమదైన రీతిలో ప్రతిభ చాటుతున్నారు. వీరిలో సౌమ్యరాణి(తాడ్వాయి), సాత్విక, సౌందర్య, శ్రావిక(సుద్దపల్లి), సరయు(ధర్మారం), కార్తీక(తూప్రాన్) ఉన్నారు.