దుబాయ్ : ఇంగ్లండ్‌తో మూడు రోజుల క్రితమే ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 23 వికెట్లతో సత్తాచాటిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ఐసీసీ ర్యాంకునూ మెరుగుపరుచుకున్నాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు ఆ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన సిరాజ్.. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐదో టెస్టుకు ముందు 27వ ర్యాంకులో ఉన్న సిరాజ్.. ఓవల్‌లో రాణించి భారత విజయంలో కీలకపాత్ర పోషించడమే గాక అత్యుత్తమ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. గతంలో అతడి కెరీర్ బెస్ట్ 16 (ఈ ఏడాది జనవరిలో) కాగా తాజాగా దానిని అధిగమించాడు.
టెస్టు బౌలర్ల జాబితాలో భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా రబాడా (దక్షిణాఫ్రికా), కమిన్స్ (ఆసీస్) టాప్-3లో ఉన్నారు. బ్యాటర్ల విషయానికొస్తే భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మళ్లీ టాప్-5లోకి వచ్చాడు. 908 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ అగ్రస్థానంలో ఉండగా అదే దేశానికి చెందిన బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. విలియమ్సన్, స్మిత్.. జైస్వాల్ కంటే ముందున్నారు. రిషభ్ పంత్ 8వ స్థానంలో ఉండగా శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పరిమితమయ్యాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 రేటింగ్ పాయింట్లు) నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి తిరుగుప్రయాణమైన సిరాజ్.. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. లండన్ నుంచి ముంబై చేరుకున్న మియా భాయ్.. అక్కడ్నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చాడు. సిరాజ్‌కు స్వాగతం పలికేందుకు పలువురు అభిమానులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా హైదరాబాద్‌కు గర్వకారణమైన సిరాజ్‌ను ఘనసత్కారం చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) భావిస్తున్నది. ఇదే విషయమై హెచ్‌సీఏ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సిరాజ్‌ను ఘనంగా సత్కరించాలని అనుకుంటున్నాం. కొన్నిరోజులు అతడు నగరంలోనే ఉంటాడు గనక సిరాజ్ వీలుచూసుకుని కార్యక్రమం ఏర్పాటుచేస్తాం. మేం ఇంకా దాని గురించి అతడితో మాట్లాడలేదు. సిరాజ్ మనందరినీ గర్వించేలా చేశాడు’ అని తెలిపాడు.
జాతీయ జట్టులో ముఖ్యంగా టెస్టుల్లో అంచనాలకు మించి రాణిస్తున్న సిరాజ్‌కు రావాల్సిన గుర్తింపు దక్కడం లేదని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రెడిట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. ‘అసాధారణమైన ప్రదర్శన. సిరాజ్ అప్రోచ్ చాలా బాగుంది. అతడి ఆత్మవిశ్వాసాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. టెస్టు సిరీస్ తొలి రోజు బంతిని వేసేటప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉంటాడో చివరి మ్యాచ్‌లో తన ఆఖరి బంతిని సంధించేటప్పుడూ అంతే ఉత్సాహంతో ఉంటాడు. ఓవల్ టెస్టులో కామెంటేటర్లు.. సిరాజ్ 145 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడని చెబుతుంటే విని ఆశ్చర్యపోయాను. ఈ సిరీస్‌లో సుమారు వెయ్యి బంతులు విసిరాక కూడా సిరాజ్ తన వేగాన్ని కోల్పోలేదు. అది అతడి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూపుతున్నది. ఓవల్ టెస్టులో ఆఖరి రోజు అతడు ఆరంభించిన తీరు అమోఘం. జట్టుకు అవసరమైనప్పుడు, కచ్చితంగా వికెట్లు తీయాలనుకున్నప్పుడు అతడు ఆ స్థాయి ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ సిరాజ్‌కు రావాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కడం లేదు’ అని టెండూల్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు.