IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు రిటెన్షన్ జాబితాకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 5 రోజుల్లో అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల పేర్లును బీసీసీఐ (BCCI)కి చెప్పేయనున్నాయి. దాంతో, ఆ ఆరుగురి ఎంపికపై జట్లు ఇప్పటికే కసరత్తును పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని చెన్నై సూపర్ కింగ్స్ ‘అన్క్యాప్డ్ ప్లేయర్’గా ఆడిస్తుందా? లేదా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇదే విషయమై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ధోనీ మాకింకా ఏమీ చెప్పలేదని కుండబద్ధలు కొట్టేశాడు. అయితే.. ధోనీ తర్వాత వికెట్ కీపర్‌గా, ఫినిషర్‌గా, మంచి నాయకుడిగా జట్టును నడిపించేది ఎవరు? అనే ప్రశ్నలకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ (Simon Doull) ఆసక్తికర సమాధానమిచ్చాడు.
CSK will Break the Bank For Rishabh Pant & We will See Pant in Yellove : Simon Doull #IPLRetention #WhistlePodu pic.twitter.com/nhnSLQSb8s
— Chakri Dhoni (@ChakriDhonii) October 25, 2024
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య పుణేలో జరిగిన రెండో టెస్టులో కామెంటేటర్‌గా వ్యవహరించిన డౌల్ ఈసారి సీఎస్కే రిటైన్ చేసుకొనే వాళ్ల పేర్లను వెల్లడించాడు. ధోనీ వారసుడిపై కూడా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే వాళ్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలు కచ్చితంగా ఉంటారు. పేసర్ మతీశ పథిరన కూడా జట్టులో ఉంటాడు. ఇక ధోనీ విషయానికొస్తే.. అక్టోబర్ 31కి ముందు అతడు ఏదో ఒకటి చెప్పేస్తాడు. మాజీ సారథి ధోనీకి వారసుడు ఎవరంటే.. రిషభ్ పంత్. మహీ మాదిరగానే పంత్.. చెన్నైని విజయపథాన నడిపిస్తాడు. ఒకవేళ పంత్ వేలానికి వస్తే.. ఎన్ని కోట్లు అయినా పెట్టి అతడిని చెన్నై దక్కించుకుంటుంది’ అని డౌల్ జోస్యం పలికాడు.
🚨MS DHONI TO PLAY IPL 2025. 🚨
– MS will be CSK’s uncapped player retention. (Cricbuzz). pic.twitter.com/78jLkYmB5f
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024
అక్టోబర్ 31లోపు 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పిస్తాయి. ఆ తర్వాత వేలంలో పాల్గొనే ఆటగాళ్లు మా కనీస ధర ఇంత అంటూ పేర్లు రిజిష్టర్ చేసుకుంటారు. ఇక.. మెగా వేలం విషయానికొస్తే నవంబర్ 25, 26 తేదీల్లో జరుగుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. సౌదీ అరేబియాలోని రియాద్లోనా లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేలం నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.