Ponzi Scheme | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.6వేలకోట్ల పోంజీ కుంభకోణం సెగ క్రికెటర్లను తాకింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద నుంచి రూ.6వేలకోట్లు జమ చేసిన బీజెడ్ గ్రూప్ చీఫ్ భూపేంద్ర సింగ్ ఝాలాను ఇప్పటికే సీఐడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బీజెడ్ గ్రూప్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తేవాటియాతో పాటు పలువురు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
రూ.450కోట్ల లావాదేవీలపై ప్రస్తుతం సీఐడీ విచారణ జరుపుతున్నది. ఇందులో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్లకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు సేకరించి వివరాల ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బీజెడ్ గ్రూప్‌లో రూ.1.95కోట్లు పెట్టినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. అలాగే, గిల్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఈ సిరీస్ ముగించుకుని స్వదేశం వచ్చాక గిల్‌ను సీఐడీ విచారించే అవకాశం ఉన్నది.