Team India | ముంబై: సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమ్ఇండియా పరివర్తన దిశగా తొలి అడుగు వేయనుంది. త్వరలో ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు సభ్యుల జాబితాను శనివారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించనున్నాడు. రోహిత్‌శర్మ రిటైర్మెంట్తో కొత్త సారథిగా ఎవరిని ఎంపికచేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు రేసులోకి రాగా బుమ్రా ఫిట్నెస్, భవిష్యత్తు దృష్ట్యా బీసీసీఐ గిల్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. అతడికి డిప్యూటీగా పంత్‌ను ఎంపిక చేసే అవకాశముంది.
రోహిత్ రిటైర్మెంట్తో జైస్వాల్‌కు తోడుగా ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే! కోహ్లీ రిటైర్మెంట్తో ఖాళీగా ఉన్న నాలుగో స్థానానికి సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ పోటీపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్‌లో సెలెక్టర్లు ఎవరి వైపునకు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. జడేజా స్పిన్ బాధ్యతలను మోయనున్నాడు. అతడికి అండగా వాషింగ్టన్, కుల్దీప్లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరం! బుమ్రా సారథ్యంలోని పేస్ దళంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కుతుందనేది అనుమానమే. మూడో పేసర్‌గా సిరాజ్ ఉండగా యువ బౌలర్లు ప్రసిద్ధ్, ఆకాశ్‌దీప్ రిజర్వ్ పేసర్లుగా ఉండనున్నారు. ఒకవేళ సెలెక్టర్లు లెఫ్టార్మ్ పేసర్‌ను తీసుకోవాలని భావిస్తే అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.