Shubman Gill | దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌లో టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయం కారణంగా టెస్ట్‌లతో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్‌లో కెప్టెన్ తాజాగా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గిల్ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడని వైద్యులు ప్రకటించారు. గిల్ పోటీ క్రికెట్లోకి తిరిగి వచ్చేందుకు అవసరమైన అన్ని ఫిట్నెస్, ప్రమాణాలను పూర్తి చేసినట్లు తెలిపారు.
అతను కోలుకునే ప్రక్రియను వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని నివేదించారు. శుభ్‌మన్ గిల్‌ను అధికారికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి విడుదల చేయనున్నారు. డిసెంబర్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సెలక్షన్ సమయంలో బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా ఫిట్నెస్ సాధించడంతో ఇక టీ20 సిరీస్‌లో కనిపించనున్నాడు.
గిల్ దక్షిణాఫ్రికాతో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయం కారణంగా రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. రెండి టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. ఈ వారం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోకి చేరుకున్నాడు. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతున్నాయి. రాంచీలో భారత్, రాయ్‌పూర్ వన్డేలో విజయం సాధించి ఈ సిరీస్‌లో 1-1తో సమానంగా ఉన్నాయి. శనివారం విశాఖపట్నం వేదికగా మూడో వన్డే జరుగున్నది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవలం చేసుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ కటక్‌లో, డిసెంబర్ 11న న్యూ చండీగఢ్‌లో రెండో మ్యాచ్.. మిగతా మూడు మ్యాచులు 14న ధర్మశాల, 17న లక్నో, 19న అహ్మదాబాద్‌లో రెండు జట్లు తలపడనున్నాయి.