Shubhman Gill : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) దుమ్మురేపుతున్నాడు. కళాత్మక షాట్లు, సొగసైన ఆటతో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను ఇప్పటికే మూడు శతకాలు కొట్టాడు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ గిల్ రెచ్చిపోయి ఆడాడు. 60 బంతుల్లోనే 129 రన్స్ కొట్టి గుజరాత్‌ను ఫైనల్ చేర్చాడు. చివరిదైన ఫైనల్ పోరులోనూ ఈ యంగ్ డైనమైట్ పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ సీజన్లో మరెవరికి సాధ్యం కాని రీతిలో రికార్డులు బ్రేక్ చేస్తున్న అతడు వంద కొట్టాం కదా! ఇక రిలాక్స్ అనుకునే రకం కాదట. అద్భుతంగా ఆడాక తర్వాతి మ్యాచ్, టోర్నమెంట్ గురించి ఆలోచిస్తాడట. ఇదే విషయాన్ని అతను స్వయంగా వెల్లడించాడు. ‘నేను బాగా ఆడిన ప్రతిసారి నా జాబ్ ఇంకా పూర్తి కాలేదని అనుకుంటా. ఆ మరుసటి రోజు ఉదయం నుంచి తర్వాతి మ్యాచ్, టోర్నమెంట్లో ఎలా రాణించాలి? అనే విషయాలే నా బుర్రలో తిరుగుతాయి. అవును.. ఐపీఎల్ అయిపోయాక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మొదలవుతుంది. ఇలా ప్రతిసారి నాలో ఏదో ఒక ఆలోచన ఉంటుంది’ అని అతను తెలిపాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ యంగ్ ఓపెనర్ అదరగొడుతున్నాడు. ఫార్మాట్, టోర్నీ ఏదైనా సరే.. సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ వర్షం కారణంగా ఈ రోజుకు (మే29) వాయిదా పడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న టాస్ సమయానికి భారీ వర్షం మొదలైంది. 4 గంటలు అయినా కూడా వాన తగ్గకపోవడంతో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్, అంపైర్లు, ఇరుజట్ల కోచ్‌లతో మాట్లాడారు. మ్యాచ్‌ను రిజర్వ్ డేన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
క్వాలిఫైయర్ 2 పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) ముంబైని ముంచాడు. అతడు సెంచరీ బాదడంతో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్(55) ఒక్కడే పోరాడాడు. అయితే.. సీనియర్ పేసర్ మోహిత్ శర్మ 5 వికెట్లు తీయడంతో ముంబై 171కు ఆలౌటయ్యింది.