Headingley test : ఇంగ్లండ్ గడ్డపై సవాళ్లు, సందేహాల నడమ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(118 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 8 ఫోర్లతో ఫిఫ్టీ బాదిన గిల్.. ఆ తర్వాత ధనాధన్ ఆడాడు. జోష్ టంగ్ ఓవర్లో బౌండరీతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. దాంతో, కెప్టెన్‌గా ఆడుతున్న తొలి ఇన్నింగ్స్‌లోనే వంద కొట్టిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడీ యంగ్‌స్టర్. హెడింగ్లేలో చిరస్మరణీయ సెంచరీ బాదిన అతడు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీల సరసన చేరాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ హీరో రికార్డు విజయ్ హజారే పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌పై ఢిల్లీ మైదానంలో శివాలెత్తిన హజారే 164 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 1976లో పగ్గాలు అందుకున్న సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్ గడ్డపై 116 రన్స్‌తో చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియాపై (115) సెంచరీతో గర్జించాడు.
హెడింగ్లే టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. టాస్ ఓడిన టీమిండియాకు ఓపెనర్లు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101), కేఎల్ రాహుల్ (42) శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి సెషన్లో చెలరేగి ఆడిన ద్వయాన్ని బ్రాండన్ కర్సే విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్(0) స్టోక్స్ వెనక్కి పంపాడు.
సాయి వెనుదిరిగాక యశస్వీ జతగా గిల్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను పరుగులు పెట్టించిన ఈ జోడీ మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. ఐదో సెంచరీ బాదిన యశస్వీని టీ సెషన్ తర్వాత స్టోక్స్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం రిషభ్ పంత్(48 నాటౌట్), గిల్ నాలుగో వికెట్‌కు 110 రన్స్ చేసి.. స్టోక్స్ సేనను డీలా పడేలా చేశారు.