భారత జట్టులో స్టార్‌గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో కూడా అతను సత్తా చాటాడు.
అయితే శ్రేయాస్ ఆటతీరులో ఒక పెద్ద సమస్య ఉందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ వేలెత్తి చూపాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో అయ్యర్ ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు. ‘‘శ్రేయాస్ సరిగా ఆడలేకపోతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అలాంటప్పుడే క్రీజులో అటూ ఇటూ దూకుతూ బంతిని ఆఫ్‌సైడ్ ఫీల్డర్ల మీదుగా తరలించేందుకు ప్రయత్నిస్తాడతను.
ముఖ్యంగా పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతాడు. షంసీని అతను చాలా ధీమాగా ఎదుర్కొన్నాడు. కానీ పేసర్ల విషయంలో విఫలమవుతున్నాడు. లేదంటే మరిన్ని బౌండరీలు సాధించేవాడే’’ అని జాఫర్ వెల్లడించాడు. అంతేకాదు, పేసర్లపై ఆధిపత్యం చెలాయించడానికి శ్రేయాస్ కొన్ని షాట్లు డెవలప్ చేసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో రాణించడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.