Shreyas Iyer : ఐపీఎల్‌తో స్టార్ కెప్టెన్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer). ఏ జట్టు పగ్గాలు అప్పగించినా తనమార్క్ సారథ్యంతో ఫలితాలు రాబట్టాడు అయ్యర్. అయితే.. పద్దెనిమిదో సీజన్ ముందు అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఫ్రాంచైజీని వీడడం సంచలనం రేపింది. ఆ జట్టుకు ట్రోఫీ సాధించి పెట్టిన అతడు వేలంలోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. తాను కోల్‌కతాను వీడడానికి బలమైన కారణమే ఉందంటున్నాడీ సర్పంచ్ సాబ్.
కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వీడడంపై అయ్యర్ తాజాగా స్పందించాడు. తాను ఎంతో చేసినప్పటికీ తగిన ప్రాధాన్యం లభించలేదని.. అందుకే ఆ ఫ్రాంచైజీకి బైబై చెప్పానని అతడు అన్నాడు. ‘కెప్టెన్‌గా నేను కోల్‌కతా టీమ్ చర్చల్లో పాల్గొనేవాడిని. కానీ, ప్రధానమైన విషయాల్లో మాత్రం నన్ను సంప్రదించేవారు కాదు. దాంతో.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) సారథిగా నేను అమలు చేయాలనుకున్న విషయాల్ని అప్పుడు చేయలేకపోయాను. కానీ, పంజాబ్ యాజమాన్యం అలా కాదు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) సాధించడంలో కీలక పాత్ర పోషించిన నాకు అన్ని విధాలా మర్యాద ఇచ్చారు. నేను చెప్పే ప్రతిమాట విన్నారు. దాంతో.. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని అనుకున్న ఫలితాలు రాబట్టగలిగాను’ అని అయ్యర్ తెలిపాడు.
Shreyas Iyer in GQ India about Punjab Kings:
“I offer a lot as a captain and player. If I get respect, anything can be accomplished – This is what happened at Punjab. They gave me all the support I needed, whether it was the coaches, management or players. I was coming off a… pic.twitter.com/tUw23sWeY1
— Johns. (@CricCrazyJohns) September 8, 2025
పద్దెనిమిదో సీజన్‌కు ముందు అయ్యర్ కోల్‌కతాను వీడడంపై సందేహాలు వెలిబుచ్చారు చాలామంది. ఏదో బలమైన కారణమే ఉంటుందని అనుకున్నారంతా. అయ్యర్ సారథ్యంలో కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే.. మెంటర్ గౌతం గంభీర్ వల్లనే కేకేఆర్ కప్ గెలిచిందని.. అతడే జట్టు రాత మార్చాడని యాజమాన్యం భావించింది. సీజన్ ఆసాంతం జట్టును గొప్పగా నడిపించిన అయ్యర్‌కు రావాల్సిన పేరు రాలేదు. దాంతో.. అసంతృప్తికి లోనైన అతడు ఫ్రాంచైజీతో కొనసాగడానికి ఇష్టపడలేదు. పద్దెనిమిదో సీజన్లో అజింక్యా రహానే సారథ్యంలో ఆడిన కోల్‌కతా సమిష్టి వైఫల్యంతో ప్లే ఆఫ్స్ ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దేశవాళీలో, ఐపీఎల్లో నాయకుడిగా మెప్పిస్తున్న అయ్యర్.. భారత జట్టు వన్డే కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. పద్దెనిమిదో సీజన్ ఐపీఎల్లో చెలరేగి ఆడిన అతడిని సెలెక్టర్లు ఆసియా కప్ స్క్వాడ్‌లోకి తీసుకోలేదు. అయితే.. భారత ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా ఏతో జరుగబోయే మ్యాచ్‌లకు అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ వేలంలో అయ్యర్‌ను రికార్డు ధరకు పంజాబ్ కొన్నది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడీ కూల్ కెప్టెన్. కానీ, టైటిల్ పోరులో ఆర్సీబీ చేతిలో ఓటమితో రెండోసారి రన్నరప్‌గా సరిపెట్టుకుంది పంజాబ్.