Shreyas Iyer : నాయకుడంటే ముందుండి నడిపించాలి. అనామకులతో కూడిన బృందాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ, అందర్నీ సమన్వయం చేసుకుంటూ మునిగిపోతున్న నావను ఒడ్డుకు చేర్చేవాడే నిజమైన కెప్టెన్. ఈ మాటలు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) కు అతికినట్టు సరిపోతాయి. తన నాయకత్వ పటిమతో 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన అయ్యర్ తాజాగా ‘టీ20 ముంబై లీగ్’లోనూ తన ముద్ర వేశాడు.
తన మార్క్ కెప్టెన్సీతో సొబో ముంబై ఫాల్కన్స్ (Sobo Mumbai Falcons)ను సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. లీగ్ ఏదైనా సరే తన సారథ్యానికి తిరుగులేదని చాటుతున్న అయ్యర్.. కెప్టెన్సీని ఎంతో ఇష్టపడుతానని చెబుతున్నాడు. ఈ సొగసరి బ్యాటర్ ఇంకా ఏం చెప్పాడంటే..’నాకు కెప్టెన్సీ అంటే ఇష్టం. నాయకత్వం వహించే సమయంలో నాలోని అత్యుత్తమ సామర్ధ్యాన్ని కనబరుస్తాను.
సారథ్యం అనేది పరిణితితో కూడిన ఒక బాధ్యత. జట్టు కోసం ప్రతిసారి అత్యుత్తమంగా ఆడాల్సి వస్తుంది. అలానే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ కెప్టెన్ వైపే చూస్తారు. అందుకే.. నేను లీడర్‌గా ఉండేందుకు ఇష్టపడుతా. 22 ఏళ్లప్పుడే తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్నా. ఆ సమయంలో ఒక సారథికి ఎదురయ్యే సవాళ్లను నేర్పుగా అధిగమించాను.
‘నీ కెప్టెన్సీ రహస్యం ఏంటి ?’ అని అందరూ అడుగుతుంటారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. నేను కూల్‌గా ఉంటాను. నా ముందున్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారిస్తా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఫోకస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. వర్తమానంలోనే ఉంటూ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటాను. స్టాండ్స్‌లోని అభిమానులను ఉత్సాహపరచడం, వాళ్లు నా పేరు మార్మోగిపోయేలా అరుస్తుంటే భలే మజాగా ఉంటుంది. ఫ్యాన్స్ మద్ధతుతో మరింత స్ఫూర్తి పొందుతాను అని అయ్యర్ వెల్లడించాడు.
ఐపీఎల్లో విజయవంతమైన సారథిగా ఎదుగుతున్నాడు శ్రేయాస్ అయ్యర్. జెర్సీ మారినా తన జోరు తగ్గదని చాటుతున్నాడు. నిరుడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఛాంపియన్‌గా నిలిపిన అతడు.. 17 ఏళ్లుగా ప్లే ఆఫ్స్ చేరని పంజాబ్ కింగ్స్ రాత మార్చాడు. ప్రశాంతంగా ఉంటూనే ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన అతడు.. క్వాలిఫయర్ 2లో అజేయ అర్ధ శతకంతో చెలరేగి జట్టును టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. అయితే.. ఫైనల్లో నిరాశపరిచిన అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్.. జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కానీ, ఆఖరి మెట్టుపై తడబడిన పంజాబ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఎంఎస్ ధోనీ (MS Dhoni) మాదిరిగానే మిస్టర్ కూల్ కెప్టెన్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్న అతడు త్వరలోనే భారత జట్టుకు నాయకుడయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం. నిరుడు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అయ్యర్.. దేశవాళీలో విధ్వంసక బ్యాటింగ్‌తో ఫామ్ చాటుకున్నాడు. అయినా సరే సెలెక్టర్లు అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. తనను పక్కనపెట్టేశారన్న కసితో కాబోలు ఐపీఎల్ 18వ సీజన్లోనూ అయ్యర్ పులిలా గర్జించాడు. నాయకుడిగా పంజాబ్‌ను గెలుపు బాట పట్టించిన అతడు 604 రన్స్‌తో రాణించాడు.