భారత అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడని ఆస్ట్రేలియా మాజీ సారధి ఇయాన్ ఛాపెల్ అన్నాడు. సఫారీల చేతిలో 2-1తో సిరీస్ కోల్పోయిన తర్వాత టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. దీనిపై స్పందించిన ఛాపెల్.. ‘ధోనీ వంటి అద్భుతమైన సారధి తర్వాత కోహ్లీ పగ్గాలు అందుకున్నాడు.
కోహ్లీలోని ఉత్సాహం అతని నిర్ణయాధికారాన్ని కప్పేస్తుందేమో అని అంతా అనుకున్నారు. ఈ ఉత్సాహం తగ్గించుకోవాలని సలహాలిచ్చారు. కానీ కోహ్లీ అలా చేయలేదు. అయినా సరే జట్టును అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాడు. సారధిగా కోహ్లీ ప్రత్యేకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’ అని వివరించాడు.
వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడని కోహ్లీని కొనియాడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో కోహ్లీ సాధించిన విజయాలు చాలా ప్రత్యేకమన్నాడు. టెస్టుల్లో జట్టుకు విజయాన్నందించాలనే అతని తపన మిగతా ఆటగాళ్లలో కూడా కనిపించేదని, తనే ముందుండి జట్టును నడిపించాడని మెచ్చుకున్నాడు.
ముఖ్యంగా పంత్‌కు కోహ్లీ ఇచ్చిన మద్దతు అద్భుతమైన నిర్ణయమన్నాడు. అలాగే తనకు నచ్చినప్పుడు కెప్టెన్సీకి రాజీనామా చేసినందుకు కూడా కోహ్లీని మెచ్చుకోవాలని పేర్కొన్నాడు.