చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్ ఆచంట శరత్ కమల్ తన 22 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. 42 ఏండ్ల వయసులోనూ కుర్రాళ్లతో కలిసి టీటీ లీగ్‌లలో పోటీ పడుతున్న శరత్.. ఈనెల చివర్లో చెన్నై వేదికగా జరుగనున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) తన కెరీర్లో చివరి టోర్నీ అని ప్రకటించాడు. 1982లో చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన శరత్.. రెండేండ్లకే రాకెట్ పట్టి చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్నాడు.
20 ఏండ్లకే (2002లో) జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన అతడు.. సుదీర్ఘ కెరీర్లో భారత టేబుల్ టెన్నిస్ ముఖచిత్రంగా ఎదిగాడు. 22 ఏండ్ల ప్రొఫెషనల్ కెరీర్లో అతడు ఏడు కామన్వెల్త్ స్వర్ణాలు నెగ్గడంతో పాటు మూడు రజతాలు, మూడు కాంస్యాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు కంచు మోత మోగించాడు.
పదిసార్లు నేషనల్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 2004, 2008, 2016, 2020, 2024 ఒలింపిక్స్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన శరత్ స్పందిస్తూ.. ‘రెండేండ్ల వయసున్నప్పుడు నేను మొదటిసారిగా రాకెట్ పట్టుకున్నా. కానీ అదే నా కెరీర్ అవుతుందని అప్పుడు నాకు తెలియలేదు. నేను ఆట నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని చెప్పట్లేదు కానీ నా రాకెట్, తలకు కట్టుకునే బ్యాండ్‌కు కాస్త రెస్ట్ ఇస్తున్నా. నా కెరీర్‌ను ప్రారంభించిన చోటే (చెన్నై) ముగించాలనుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు.